నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా | Prithvi Shaw Recall Doping Violation Didnt Step Out Of My Room For Month | Sakshi
Sakshi News home page

నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా

Published Sun, May 23 2021 4:36 PM | Last Updated on Sun, May 23 2021 4:43 PM

Prithvi Shaw Recall Doping Violation Didnt Step Out Of My Room For Month - Sakshi

ముంబై: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా..  ఒకవైపు నుంచి అతని ఆటతీరు గమనిస్తే సెహ్వాగ్‌, సచిన్‌లు గుర్తుకురావడం ఖాయం. పృథ్వీ ఆడే కొన్ని షాట్లు వారిద్దరి స్టైల్‌ను పోలి ఉంటాయి. అలాంటి పృథ్వీ షా 2018 అండర్‌ 19 టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాకు నాయకత్వం వహించాడు. అతని సారధ్యంలోనే టీమిండియా నాలుగోసారి అండర్‌ 19 ప్రప‍ంచకప్‌ను సాధించింది. ఈ దెబ్బతో పృథ్వీ షా ఒక్కసారిగా టీమిండియా సీనియర్‌ జట్టులో చోటు సంపాదించాడు. ఏకంగా టెస్టు మ్యాచ్‌ ద్వారా టీమిండియా తరపున అరంగేట్రం చేసిన పృథ్వీ వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డెబ్యూ సెంచరీతో ఆకట్టుకొని అందరిచూపు తన వైపుకు తిప్పుకున్నాడు.

పృథ్వీ షా జోరును చూసి అంతా మరో సచిన్‌.. సెహ్వాగ్‌లా పేరు తెచ్చుకుంటాడని భావించారు. సరిగ్గా నాలుగు నెలల తిరగ్గానే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ నిర్వహణలో భాగంగా ఆటగాళ్లందరికి బీసీసీఐ డోపింగ్‌ టెస్టు నిర్వహించింది. కాగా డోపింగ్‌ టెస్టులో పృథ్వీ షా పట్టుబడ్డాడు. దగ్గుకు సంబంధించి తీసుకున్న సిరప్‌లో నిషేధిత డ్రగ్‌ ఉన్నట్లు తేలడంతో పృథ్వీ షాపై 8 నెలల బ్యాన్‌ పడింది. దీంతో బంగ్లాదేశ్‌తో హోం సిరీస్‌తో పాటు కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు షా దూరమయ్యాడు. ఆ ఎనిమిది నెలలు పృథ్వీ షా చీకటిరోజులుగా భావించాడు.

తాజాగా మరోసారి ఆ చీకటి రోజులను పృథ్వీ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ''నేను, నా తండ్రి తప్పు చేశామని.. ఆరోజు డాక్టర్‌ను కన్సల్ట్‌ అయి ఉంటే ఆ బ్యాన్‌ నామీద పడేది కాదని పేర్కొన్నాడు. నాపై 8 నెలల బ్యాన్‌ పడడంపై.. ఈ అంశంలో నాతో పాటు నా తండ్రి కూడా పరోక్షంగా కారణమయ్యాడు. నాకు బాగా గుర్తు.. మేం ఇండోర్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ కోసం ప్రిపేర్‌ అవుతున్నాం. అయితే రెండు రోజుల నుంచి నాకు జలుబు.. దగ్గు ఉంది. ఇక ఆరోజు రాత్రి డిన్నర్‌ చేయడానికి బయటకు వెళ్లాం..  నా తండ్రికి ఫోన్‌ చేసి మాట్లాడుతుండగా విపరీతంగా దగ్గు రావడం మొదలైంది. దీంతో మార్కెట్‌ దగ్గు తగ్గడానికి ఏదైనా సిరప్‌ ఉంటే వెళ్లి తెచ్చుకో.. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు.

అయితే ఇక్కడే నేను తప్పు చేశాను. దగ్గుకు సంబంధించి డాక్టర్‌ను కన్సల్ట్‌ అవ్వకుండా మార్కెట్‌కు వెళ్లి సిరప్‌ తెచ్చుకొని రెండురోజులు తాగాను. మూడో రోజు డోపింగ్‌ టెస్టులో పట్టుబడ్డాను.. నిషేధిత డ్రగ్‌ వాడినందుకు బీసీసీఐ నాపై 8 నెలల బ్యాన్‌ విధించింది. దీంతో మానసికంగా చాలా కుంగిపోయా. రెండు నెలల పాటు ఒంటరిగా గదిలోనూ ఉంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఆ బ్యాన్‌ నా కెరీర్‌ను నాశనం చేస్తుందని.. నా ముఖం ఎలా చూపించాలో అర్థం కాక నాలో నేను కుమిలిపోయేవాడిని. ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు లండ్‌కు వెళ్లా.. అక్కడికి వెళ్లినా అవే ఆలోచనలు నన్ను చట్టుముట్టడంతో నెలరోజుల పాటు గదిలో నుంచి బయటికి రాలేకపోయా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే పృథ్వీ తాను చేసిన తప్పును బీసీసీఐ ఎదుట నిజాయితీగా ఒప్పుకోవడంతో పాటు తనకు తెలియకుండా నిషేధిత డ్రగ్‌(టెర్బుటాలిన్) వాడినట్లు తేలడంతో అతనిపై బ్యాన్‌ తొలిగించింది. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరిన పృథ్వీ షా ద్రవిడ్‌ పర్యవేక్షణలో మరింత రాటు దేలాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున మంచి ప్రదర్శన కనబరిచిన షా ఆసీస్‌ టూర్‌కు ఎంపికయ్యాడు. అయితే ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలవడంతో పాటు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత జరిగిన దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోఫీలో మాత్రం దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలతో చెలరేగిన పృథ్వీ ఆ టోర్నీలో 827 పరుగులు చేసి టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ పృథ్వీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 8 మ్యాచ్‌లాడిన షా 308 పరుగులతో రాణించాడు.  ఐపీఎల్‌లో ఆకట్టుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు పృథ్వీ షాను పరిగణలోకి తీసుకోలేదు. అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా రెండో జట్టుకు అతను ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. 
చదవండి: రిస్క్‌ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే

పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement