న్యూఢిల్లీ: గతేడాది డోపింగ్ టెస్టులో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్న భారత యువ క్రికెటర్ పృథ్వీ షా.. ఆ సమయం చాలా నరకంగా అనిపించిందన్నాడు. ఒక చిన్నపొరపాటుకు డోపింగ్‌లో పట్టుబడటం ఒకటైతే, కొందరు చేసే విమర్శలు ఇంకా బాధించాయన్నాడు. ఆ కష్ట సమయాన్ని ఓర్పుగా భరించానని పేర్కొన్న పృథ్వీ షా.. ఆ విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనుకున్నానని తెలిపాడు. తాను డోపింగ్ టెస్టులో విఫలమై క్రికెట్‌కు దూరమైన సమయంలో ఒక విషయం మాత్రం బోధపడిందన్నాడు.తాను వంద శాతం ప్రజల్ని సంతృప్తి పరచలేనని విషయం అర్థమైందన్నాడు. తాను ఇంటి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితుల్లో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నానన్నాడు. (భారత్ సాయం కోరిన అక్తర్)
‘ నా క్రికెట్ కెరీర్‌లో అండర్-19 వరల్డ్‌కప్ గెలవడం ఒక మరచిపోలేని జ్ఞాపకమైతే, అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయడం మరొక జ్ఞాపకం. ఈ రెండు ఎప్పటికీ మరచిపోలేనివి. ఇక డోపింగ్ కంట్రోల్ అనేది నా చేతుల్లోనే ఉంటుంది. గాయాలు అనేవి మన చేతుల్లోఉండవు. విమర్శలు అనేవి జీవితంలో ఒక భాగమే. విమర్శలు చేసేటప్పుడు అది మంచి విమర్శగా ఉండాలి. అది మనకు ఉపయోగపడాలి. నిజంగా 2019 సంవత్సరం నాకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిపోయింది. ప్రతీ విమర్శను మనం డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు బ్యాట్‌తోనే వాటికి సమాధానం చెబుతా’ అని పృథ్వీ షా తెలిపాడు.
‘గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ముష్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున ఆడిన నేను తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడ్డాను. దీంతో తక్షణ ఉపశమనం కోసం దగ్గుమందు వాడాను. ఆసీస్ టూర్‌లో అయిన కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలనే ఆతృతలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కాఫ్ సిరప్ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. కనీసం బీసీసీఐ డాక్టర్‌ను కానీ, వేరే డాక్టర్‌ను కానీ సంప్రదించాల్సి ఉండాల్సింది. తొందర్లో చిన్న మెడిసినే కదా అని ఆ సిరప్ వాడాను. అది నిషేధిత మెడిసన్ అనే విషయం తెలియదు. దాంతో ఇబ్బందుల్లో పడ్డాను’ అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ఆ తెలియక చేసిన తప్పుకు నరకం అనుభవించానని ఈ యువ ఓపెనర్ తనలోని ఆవేదనను మరోసారి వెళ్లగక్కాడు. (రవిశాస్త్రి ‘ట్రేసర్ బుల్లెట్’ వైరల్..!)
Comments
Please login to add a commentAdd a comment