సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్న ఆల్‌రౌండర్
న్యూఢిల్లీ: జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... దేశవాళీల్లో తప్పక ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన హెచ్చరికలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ షెడ్యూల్ లేని సమయంలో కూడా దేశవాళీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు... రంజీ ట్రోఫీలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేయగా... ఇప్పుడు ఆ జాబితాలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు.
చివరిసారిగా రెండేళ్ల క్రితం సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా... ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఆదివారం రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర జట్టు సభ్యులతో కలిసి జడేజా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ‘జడేజా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడు’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయ్‌దేవ్ షా తెలిపారు.
గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్... చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని వెల్లడించగా... రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తమ తమ జట్ల తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడనున్నారు. దీంతో ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున రిషబ్ పంత్, సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడనున్నారు.
విదర్భతో పోరుకు సిరాజ్
భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వర్గాలు వెల్లడించాయి.
‘వర్క్‌లోడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో సిరాజ్ ఆడటం లేదు. విదర్భతో పోరులో మాత్రం అతడు జట్టులో ఉంటాడు’ అని ఓ హెచ్‌సీఏ అధికారి తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడనే నమ్మకంతో సెలెక్టర్లు సిరాజ్‌ను కాదని అర్‡్షదీప్ సింగ్‌ను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment