మళ్లీ నాకౌటేనా!
రోయెర్‌తో విజేందర్ బౌట్ నేడు
లండన్: బరిలోకి దిగిన నాలుగు బౌట్లలోనూ ప్రత్యర్థులను నాకౌట్ చేసిన భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ మరో గట్టిపోరుకు సిద్ధమయ్యాడు. తన కంటే అనుభవజ్ఞుడైన ఫ్రాన్స్ బాక్సర్ రోయెర్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనున్నాడు. గత నాలుగు బౌట్లను మూడు రౌండ్లు కూడా దాటనీయని భారత బాక్సర్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. స్ట్రాట్‌ఫోర్డ్ ఎరెనాలో జరిగే ఈ బౌట్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అయితే ప్రొఫెషనల్ కెరీర్‌లో ఏడేళ్ల అనుభవం ఉన్న రోయెర్‌ను ఓడించడం అంత సులువు కాదు. ఇప్పటి వరకు విజేందర్ తలపడిన బాక్సర్లలో ఇతడే బలమైన ప్రత్యర్థి.
రోయెర్ 44 బౌట్‌లలో తలపడి 14 విజయాలు సాధించాడు. ‘రోయెర్ చాలా పటిష్టమైన ప్రత్యర్థి. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా పోరాడతాడు. అయితే అతను మెరుగైన బాక్సరే అయినా.. నేను కూడా తక్కువేమీ కాదు. వీలైనంత త్వరగా బౌట్‌ను ముగించేందుకు కృషి చేస్తా. గత వాటితో పోలిస్తే ఇది కాస్త ఎక్కువసేపు జరగొచ్చు. ఓ రకంగా నాకు కూడా మంచిదే’ అని విజేందర్ పేర్కొన్నాడు.