
మాడ్రిడ్: స్పెయిన్ రెజ్లింగ్ గ్రాండ్‌ప్రిలో భారత మహిళా రెజ్లర్లు ఆరు పతకాలతో సత్తా చాటారు. జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు) పసిడి పతకాలు సాధించగా, పూజ దండా (57 కేజీలు), సీమా (50 కేజీలు), మంజు కుమారి (59 కేజీలు), కిరణ్ (76 కేజీలు) రజత పతకాలు సాధించారు. ఫైనల్స్‌లో జెస్సికా బ్లాస్కా (నెదర్లాండ్స్)పై వినేశ్; అగ్నెస్కా వీస్‌జెజెక్ (పోలాండ్)పై దివ్య గెలుపొందగా... వెరోనికా చుమికోవా (రష్యా) చేతిలో పూజ, ఇవోనా (పోలాండ్) చేతిలో సీమా, లియుబోవ్ ఒవ్‌చరోవా (రష్యా) చేతిలో మంజు, సెనియా బురకోవా (రష్యా) చేతిలో కిరణ్ ఓడిపోయారు. ఈ టోర్నీలో భారత్ 130 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రష్యా 165 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.