కివీస్ ను కుమ్మేస్తున్నారు!
ఇండోర్:న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, అజింక్యా రహానేలు చెలరేగిపోతున్నారు. ఈ జోడి తమ బ్యాట్లకు మరింత పని చెబుతూ కివీస్ను కుమ్మేస్తోంది. నాల్గో వికెట్ కు మూడొందలకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి న్యూజిలాండ్కు పరీక్షగా నిలిచారు. దాంతో భారత్ జట్టు 133.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. కోహ్లి(184), రహానే(154)లతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ సాధించిన స్కోరులో 32 ఫోర్లు ఉండటం విశేషం.
267/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ అత్యంత నిలకడగా ఆడటంతో పటిష్టస్థితికి చేరింది. ఇది రెండో రోజు మాత్రమే కావడంతో భారత్ మరిన్ని పరుగులు సాధించే అవకాశం ఉంది.