నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ 318 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్ తొలి రోజు తుది జట్టు ఎంపికపై పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై జట్టు కెప్టెన్ కోహ్లి మ్యాచ్ ముగిసిన తర్వాత వివరణ ఇచ్చాడు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు ప్రయోజనాల కోసమేనన్న కెప్టెన్... టెస్టులో సహచరుల ఆటపై ప్రశంసలు కురిపించాడు. ‘తుది జట్టు విషయంలో మేమందరం కలిసి ముందుగా చర్చించుకొని ఆ తర్వాత టీమ్‌కు ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఆడే 11 మంది విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమేనని అందరూ అర్థం చేసుకుంటారు’ అని కోహ్లి స్పష్టం చేశాడు.
రోహిత్ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న నిర్ణయాన్ని కెప్టెన్ సమర్థించుకున్నాడు. ‘కాంబినేషన్ కీలకం కాబట్టి విహారి జట్టులోకి వచ్చాడు. అతను నాణ్యమైన పార్ట్‌టైమ్ బౌలర్. ఓవర్‌రేట్ పెరిగిపోతోందని అనిపించిన సమయంలో విహారి పనికొస్తాడు’ అని విరాట్ చెప్పాడు. తాను అనుకున్న వ్యూహాలను సహచరులందరూ సమర్థంగా అమలు చేయడం ఆనందంగా ఉందని కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఇక ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి త్రుటిలో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 93 పరుగులతో ఆకట్టుకున్న అతను ఇకపై తన ఆఫ్‌స్పిన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించాడు.
1: విదేశీ గడ్డపై భారత్‌కు ఇదే (318 పరుగులు) అతి పెద్ద విజయం. 2017లో శ్రీలంకను (గాలే) భారత్ 304 పరుగులతో ఓడించింది.
27: కోహ్లి కెప్టెన్సీలో భారత్‌కు ఇది 27వ టెస్టు విజయం. అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా ధోని (27) రికార్డును కోహ్లి సమం చేశాడు.
12: కోహ్లి కెప్టెన్సీలో విదేశాల్లో భారత్ 12 టెస్టులు గెలిచింది. ఈ క్రమంలో విదేశీ గడ్డపై అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా గంగూలీ (11) ఘనతను విరాట్ అధిగమించాడు.
100: అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు కలిపి) కెప్టెన్‌గా కోహ్లికిది వందో విజయం. అతనికంటే ముందు భారత్ తరఫున ధోని (178), అజహర్ (104) వందకంటే ఎక్కువ విజయాలు సాధించారు.
100: భారత్‌పై విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 2006లో ఆ జట్టు 103 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment