కోహ్లి డ్రింక్స్...
వరుసగా 54 టెస్టులు ఆడిన తర్వాత విరాట్ కోహ్లి ఆటకు బ్రేక్ లభించింది. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో కోహ్లి ధర్మశాల టెస్టుకు దూరమయ్యాడు. అయితే మైదానంలోకి రాకుండా మాత్రం అతను ఉండలేకపోయాడు. ఎలాంటి చిన్నతనంగా భావించకుండా డ్రింక్స్ బాటిల్స్‌తో ఫీల్డ్‌లోకి వచ్చి కోహ్లి సహచరులను ఉత్సాహపరిచాడు. తొలి వికెట్ తీసిన అనంతరం బౌండరీ బయటి నుంచి కుల్దీప్‌ను అభినందించి తగిన సూచనలు కూడా ఇచ్చాడు. 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన తర్వాత కోహ్లి ఆడకపోవడం ఇదే తొలిసారి.
కెప్టెన్ నంబర్ 33...
అజింక్య రహానే భారత్ టెస్టుల్లో నాయకత్వం వహించిన 33వ ఆటగాడిగా నిలిచాడు. రహానే గతంలో ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో కూడా కెప్టెన్‌గా పని చేయలేదు. ముంబై తరఫున గతంలో ఉమ్రీగర్, నారీ కంట్రాక్టర్, రామ్‌చంద్, వడేకర్, గావస్కర్, వెంగ్సర్కార్, రవిశాస్త్రి, సచిన్ భారత్‌కు కెప్టెన్‌లుగా వ్యవహరించారు. తొలి రోజు రహానే తనదైన శైలిలో ఎలాంటి ఉద్వేగాలకు లోను కాకుండా ప్రశాంతంగా, సమర్థంగా జట్టును నడిపించాడు. ఆటలో ఇరు జట్ల మధ్య ఏ క్షణంలో కూడా మాటల తూటాలు, దూషణలు కనిపించలేదు. ఈ సిరీస్‌లో ఒక అంపైర్ రివ్యూ కూడా లేకుండా సాగిన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం.