విరాట్ మరో రికార్డు!
ముంబై: పరుగుల దాహంతో చెలరేగిపోతున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి... ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(1997), రాహుల్ ద్రవిడ్(2006)లు మాత్రమే ఈ ఘనతను సాధించిన భారత కెప్టెన్లు.
విరాట్ సాధించిన వెయ్యి పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 మ్యాచ్ల్లో 17 వ ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ మార్కును చేరాడు. ఒక క్యాలెండర్ ఇయర్ వెయ్యి పరుగులు సాధించే క్రమంలో విరాట్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 211. ఇదిలా ఉండగా ఒక ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ ముందంజలో ఉన్నాడు. 2010లో సచిన్ 1562 పరుగులను చేశాడు.ఆ తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు. 2010లో సెహ్వాగ్ 1422 పరుగులు నమోదు చేశాడు.
ఇంగ్లండ్తో విశాఖలో జరిగిన రెండో టెస్టులో విరాట్ ఒక రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఓవరాల్గా 248 పరుగులు చేసి ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా విరాట్ చరిత్ర సృష్టించాడు. విశాఖ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులతో మెరవడంతో ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు.
విరాట్ ఎట్ 4,000!
మరొకవైపు ఈ మ్యాచ్లో 41 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి.. టెస్టుల్లో నాలుగువేల పరుగుల మార్కును చేరాడు. దాంతో టెస్టుల్లో నాలుగు వేల పరుగుల సాధించిన 14వ భారత ఆటగాడిగా విరాట్ నిలిచాడు.