నంబర్ వన్ ర్యాంక్ వర్షార్పణం!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: గత వారం అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్గా నిలిచిన విరాట్ నేతృత్వంలోని టీమిండియా తన ర్యాంకును కోల్పోయే ప్రమాదంలో పడింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్కు వరుణుడు పదే పదే ఆటంకం కల్గించడంతో టీమిండియా తన ర్యాంకును చేజార్చుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది.
అయితే విండీస్తో నాల్గో టెస్టులో విజయం సాధిస్తేనే టీమిండియా ర్యాంకు పదిలంగా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం భారత ర్యాంకు కిందికి పడిపోతుంది. ఇప్పటికే మూడు రోజుల ఆట వర్షార్పణం కావడంతో టీమిండియా నంబర్ ర్యాంకుకు ముప్పుగా మారింది. ఇక రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సిరీస్ను 3-0 తో గెలిస్తేనే టీమిండియా నంబర్ ర్యాంకు నిలుస్తుంది.
ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం పాకిస్తాన్ ప్రథమ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత జట్టు 112 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ పాకిస్తాన్ 2-2 తో డ్రా చేసుకుంది. దీంతో పాకిస్తాన్ రెండో స్థానానికి చేరింది. అదే క్రమంలో శ్రీలంకపై 3-0 తేడాతో ఆసీస్ ఓడిపోయింది. దీంతో ఆసీస్ ఒక్కసారిగా రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయింది.