బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా, ఆపై కింగ్స్ పంజాబ్ ఏడు వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఔటైన తర్వాత ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి రియాక్షన్ హాట్ టాపిక్‌గా మారింది. బౌండరీ లైన్ వద్ద కోహ్లి క్యాచ్ పట్టడంతో అశ్విన్ పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లి క్యాచ్ అందుకున్న తర్వాత అనుచిత వ్యాఖ్యలతో అశ్విన్‌కు సెండాఫ్ పలికినట్లు వీడియోలో కనబడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు విజయానికి ఆఖరి 6 బంతుల్లో 27 పరుగులు అవసరమవగా.. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ తొలి బంతినే సిక్స్‌గా తరలించాడు. లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి తలమీదుగా అది సిక్స్‌గా వెళ్లింది. కానీ రెండో బంతిని ఉమేశ్ యాదవ్ స్లో డెలివరీ రూపంలో విసరగా.. దాన్ని కూడా అదే తరహాలో అశ్విన్ హిట్ చేశాడు. అయితే ఈసారి బంతి నేరుగా కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. ఆ క్యాచ్ పట్టిన తర్వాత అశ్విన్‌ను కవ్విస్తూ కోహ్లి సంబరాలు చేసుకున్నాడు. దీనిపై కొంత మంది సోషల్ మీడియాలో కోహ్లిని విమర్శిస్తుండగా.. అతని అభిమానులు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment