‘రోహిత్‌ 59 శాతం.. విరాట్‌ 61 శాతం.. అయినా ఎందుకిలా?’ | Rohit Played 59 Percent Matches Kohli: Sanjay Manjrekar Dig At India Stars | Sakshi
Sakshi News home page

‘రోహిత్‌ 59 శాతం.. విరాట్‌ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్‌?’

Published Wed, Aug 28 2024 5:10 PM | Last Updated on Wed, Aug 28 2024 5:27 PM

Rohit Played 59 Percent Matches Kohli: Sanjay Manjrekar Dig At India Stars

టీమిండియా సీనియర్లు దులిప్‌ ట్రోఫీ టోర్నీలో పాల్గొనాల్సిందని భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. వారికి ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి దొరికిందని.. అయినా ఈ దేశవాళీ టోర్నమెంట్‌కు దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నించాడు. యువ క్రికెటర్లతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి, పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇందులో ఆడితే బాగుండేదని పేర్కొన్నాడు.

ఆ నలుగురు దూరం
కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లకు దులిప్‌ ట్రోఫీ రూపంలో కావాల్సినంత ప్రాక్టీస్‌ లభించనుంది. రోహిత్‌, కోహ్లి, అశూ, బుమ్రా మినహా టీమిండియాలోని దాదాపు అందరు ఆటగాళ్లు ఈ రెడ్‌బాల్‌ టోర్నీ బరిలో దిగనున్నారు. 

అయితే, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, యువ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఆఖరి నిమిషంలో తప్పుకోగా.. సిరాజ్‌, ఉమ్రాన్‌ స్థానాలను నవదీప్‌ సైనీ, గౌరవ్‌ యాదవ్‌తో భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారమే ప్రకటించింది.

ఐదేళ్లలో 249 మ్యాచ్‌లు.. వీరు ఆడింది మాత్రం
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఎక్స్‌ వేదికగా సీనియర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గత ఐదేళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో రోహిత్‌ కేవలం 59 శాతం, విరాట్‌ 61 శాతం, బుమ్రా 34 శాతం మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. 

వీళ్లకు దొరికినంత విశ్రాంతి మరే ఇతర భారత క్రికెటర్లకు దొరలేదన్నది నా అభిప్రాయం. వీరిని దులిప్‌ ట్రోఫీకి ఎంపిక చేయాల్సింది’’ అని పేర్కొన్నాడు. కనీసం ఫస్ట్‌రౌండ్‌లోనైనా ఈ మేటి క్రికెటర్లు పాల్గొనాల్సిందని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

వరుస టెస్టు సిరీస్‌లు
కాగా సెప్టెంబరు 5 నుంచి దులిప్‌ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌ ఆరంభం కానుంది. అనంతపురం, బెంగళూరులలో ఈ టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబరు 19 నుంచి టీమిండియా మళ్లీ బిజీకానుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

ఆ తర్వాత బెంగళూరు, పుణె, ముంబై వేదికగా భారత్‌ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అనంతరం నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ చేరాలంటే ఈ సిరీస్‌లు భారత్‌కు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలోనే సీనియర్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement