దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు బరిలో దిగిన భారత క్రికెట్ జట్టు విజయంతో పునరాగమనం చేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
ఇక బంగ్లాదేశ్‌తో టెస్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ శతకాలతో మెరవగా.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో రాణించాడు. సెంచరీ కొట్టడంతో పాటు ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలం
అంతాబాగానే ఉన్నా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వైఫల్యం మాత్రం అభిమానులను నిరాశపరిచింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ 11, కోహ్లి 23 పరుగులు మాత్రమే చేయడం మేనేజ్‌మెంట్‌లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.
టీమిండియాకు ఇది మంచికాదు
రోహిత్, కోహ్లి దులిప్ ట్రోఫీ-2024లో ఆడితే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయినా.. ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతుల ఆధారంగా తారతమ్యాలు చూపించడం.. భారత క్రికెట్‌కి మంచిది కాదని పేర్కొన్నాడు. ఈ మేరకు సంజయ్ మంజ్రేకర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరు వరల్డ్‌క్లాస్ బ్యాటర్లు. తిరిగి ఫామ్‌లోకి రాగలరు. కానీ ఈ సిరీస్‌కు ముందు దులిప్ ట్రోఫీ ఆడితే బాగుండేది.
వారిని ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఆడించే వీలున్నా విశ్రాంతినిచ్చారు. మిగతా వాళ్లకు మాత్రం ఆ వెసలుబాటు లేదు. అయినా.. ఒక్కక్కళ్లను ఒకలా ట్రీట్ చేయడం భారత క్రికెట్‌కు నష్టంచేకూర్చే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లిల క్రేజ్ దృష్ట్యా వారు కోరినట్లు చేయడం సరికాదు.
దులిప్ ట్రోఫీ ఆడి ఉంటే వారిద్దరు ఫామ్‌లోకి వచ్చేవారు’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టులో మిగతా ప్లేయర్లు రాణించారు కాబట్టి సరిపోయిందని.. లేదంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా రోహిత్, కోహ్లితో పాటు అశ్విన్, బుమ్రా సైతం దులిప్ ట్రోఫీ ఆడలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: నేను హార్డ్ హిట్టర్‌ని.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడతా: విండీస్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment