కెప్టెన్ కోహ్లీ అరుదైన ఘనత!
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీలతో
చెలరేగడంతో తొలి రోజు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులు పరుగులు చేసింది. ఈ క్రమంలో సెంచరీ వీరుడు కోహ్లీ ఓ అరుదైన ఫీట్ సాధించాడు. కోహ్లీ టెస్టుల్లో తానాడిన ప్రతి ప్రత్యర్థి జట్లపై సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ ఆరు టెస్ట్ హోదా జట్లపై సెంచరీ బాదిన కోహ్లీ, తాజాగా గురువారం బంగ్లాపై సెంచరీతో తాను ఆడిన ఏడు టెస్ట్ హోదా దేశాలపై సెంచరీ చేసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో రికార్డుకు 31 పరుగుల దూరంలోనూ నిలిచాడు.
సెహ్వాగ్ రికార్డుకు 30 పరుగుల దూరంలో కోహ్లీ
ఉప్పల్ స్డేడియంలో 130 బంతుల్లో కోహ్లీ సెంచరీ సాధించాడు. కోహ్లీ కెరీర్లో ఇది 16వ టెస్ట్ సెంచరీ. కాగా, టెస్టు హోదా ఉన్న పాకిస్తాన్, జింబాబ్వే జట్లపై కోహ్లీ టెస్టు మ్యాచ్లు ఆడలేదు. ఓ సీజన్లో భారత గడ్డపై అత్యధిక స్కోరు చేసిన జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు. 2016-17 సీజన్లో 15 టెస్టులాడిన కోహ్లీ 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 1075 పరుగులు చేసి సెహ్వాగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. మరో 31 పరుగులు చేస్తే కోహ్లీ అగ్రస్థానంలో నిలుస్తాడు. 2004-05 సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ 17 మ్యాచ్ లాడి 4 సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 1105 పరుగులు చేసిన విషయం తెలిసిందే.