
ధోని స్థానం భర్తీకి సమయం పడుతుంది: ఆఫ్రిది
భారత టెస్టు క్రికెట్ నూతన సారథి విరాట్ కోహ్లి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేడని, ఎంఎస్ ధోని వదిలి వెళ్లిన కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అతడికి కాస్త...
కరాచీ: భారత టెస్టు క్రికెట్ నూతన సారథి విరాట్ కోహ్లి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేడని, ఎంఎస్ ధోని వదిలి వెళ్లిన కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అతడికి కాస్త సమయం పడుతుందని పాకిస్తాన్ డాషింగ్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అన్నాడు. అయితే కోహ్లి క్రికెట్ నైపుణ్యానికి తాను పెద్ద అభిమానినని, అతడు ఇంకా నాయకుడిగా ఎదగాల్సి ఉందని చెప్పాడు. ‘ధోని రిటైర్మెంట్ నిర్ణయం నన్ను నిరాశపరిచింది.
అతడో పోరాట యోధుడు. భారత క్రికెట్‌కు గొప్ప సారథిగా నిలిచాడు. చాలాసార్లు ముందుండి జట్టుకు విజయాలు అందించాడు. అసలు భారత క్రికెట్ ముఖ చిత్రాన్నే తాను మార్చాడు. అన్ని ఫార్మాట్లలోనూ చాంపియన్‌గా నిలబెట్టాడు’ అని ఆఫ్రిది కొనియాడాడు. ఇక ప్రపంచకప్ అనంతరం వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనే తన ఆలోచనలో మార్పు ఉండదని ఆఫ్రిది చెప్పాడు.
ఆ టోర్నీలో అద్భుతంగా రాణించినా ఇదే నిర్ణయంతో ఉంటానని అన్నాడు. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ బలవంతంగా జరగడం తాను చూశానని, అలాంటి పరిస్థితి తెచ్చుకోనని 389 వన్డేలాడిన ఆఫ్రిది తెలిపాడు.