
హైదరాబాద్: మ్యాచ్ మ్యాచ్‌కు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ క్రికెట్‌లో సరికొత్త అధ్యయాన్ని టీమిండియా సారథి విరాట్ కోహ్లి లిఖిస్తున్న విషయం తెలిసిందే. ఆటగాడిగా, సారథిగా అపురూప విజయాలును సాధిస్తున్న కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఎన్డీటీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ.. ‘ప్రస్తుత బ్యాట్స్‌మన్‌లలో విరాట్ కోహ్లికి నేను వీరాభిమానిని. ప్రస్తుత క్రికెట్‌లో అతడే అత్యుత్తమం.
కానీ కోహ్లి నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ధోని నుంచి నాయకత్వ లక్షణాల గురించి కోహ్లి చాలానే నేర్చుకోవాలి. ఎంఎస్ ధోనిలా మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే కోహ్లి ఇంకాస్త పరిణితి చెందాలి. నా దృష్టిలో ధోనినే అత్యుత్తమ సారథి. ధోని కూల్ కెప్టెన్సీ, మైదనంలో తీసుకునే నిర్ణయాలకు ఫిదా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఆఫ్రిది ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇక ప్రస్తుతం కోహ్లి సేన ఆస్ట్రేలియాపై గెలవడమనేది వారి చేతుల్లోనే ఉందన్నాడు. పొరపాట్లకు ఆస్కారమివ్వకుండా ఆడితే టీమిండియా సులువుగా గెలుస్తుందన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా బలంగా ఉందన్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ జట్లలో అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు టీమిండియానేనని ప్రశంసించాడు. ఆసీస్ బౌన్సీ పిచ్‌లకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, కాస్త జాగ్రత్తగా ఆడితే సులువుగా పరుగులు రాబట్టవచ్చాన్నాడు.