
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జట్టులో క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్,
ఇస్లామాబాద్ : మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా మెగా టోర్నీ ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉండగా.. విదేశీ ఆటగాళ్లు మాత్రం ప్రపంచకప్ కోసం లీగ్‌ను వీడుతున్నారు. మెగా టోర్నీకి సొంత జట్టులో చేరి సంసిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఈ మెగా టోర్నీ ఫీవర్ అభిమానులను అందుకుంది. మాజీ క్రికెటర్లు సైతం తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తూ.. ఏయే జట్లకు టైటిల్ నెగ్గే అవకాశం ఉందోనని అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల ఆటగాళ్లపై సమీక్షలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ 2019 ప్రపంచకప్ టోర్నీ కోసం ఆల్‌టైం వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జట్టులో క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ప్రపంచ బెస్ట్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి అవకాశం ఇవ్వలేదు. ఇది భారత అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఆరు ప్రపంచకప్‌లు, 44 ఇన్నింగ్స్‌ల్లో 56.95 సగటు.. 16 అర్థసెంచరీలు, 6 సెంచరీలతో 2278 పరుగులు చేసిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌కు జట్టులో అవకాశం ఇవ్వవా? అంటూ మండిపడుతున్నారు. మరోవైపు ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్, వికెట్ కీపర్.. భారత్‌కు ప్రపంచకప్ అందించిన సారథి ధోనికి కూడా చోటివ్వవా అంటూ నిలదీస్తున్నారు. అఫ్రిదీ తన ఆల్‌టైం జట్టులో భారత్ నుంచి ఒక్క విరాట్ కోహ్లికి మాత్రమే అవకాశం ఇచ్చాడు.
అఫ్రిదీ ప్రకటించిన ఆల్‌టైం జట్టు..
సయూద్ అన్వర్, ఆడం గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి, ఇంజుమామ్ ఉల్ హక్, జాక్వస్ కల్లీస్, వసీం అక్రం, గ్లేన్ మెక్‌గ్రాత్, షేన్‌వార్న్, షోయబ్ అక్తర్, సక్లైన్ ముస్తాక్
‘ధోని చాలా బాగా గేమ్‌ని అర్థం చేసుకుంటాడు. ఎంతలా అంటే..? వన్డేల్లో తొలి బంతి నుంచి 300 బంతి వరకూ ఎప్పుడు.. ఏం చేయాలి..? ఎలా చేయాలి..? అనేదానిపై అతనికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది.’ అని మిస్టర్ కూల్ సామర్థ్యం గురించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అటువంటి ధోనికి అఫ్రిది ఆల్‌టైం జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై క్రికెట్ విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు.