కెప్టెన్ కోహ్లీ శతక్కొట్టాడు!
ఇండోర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ(191 బంతుల్లో 103: 10 ఫోర్లు) సాధించాడు. స్వదేశంలో 17 ఇన్నింగ్స్ ల తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. చివరగా 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చెన్నై టెస్టులో శతకం చేశాడు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. దీంతో వరుసగా మూడో టెస్టులోనూ టీమిండియానే పైచేయి సాధించింది. కోహ్లీ, అజింక్యా రహానే(172 బంతుల్లో 79 నాటౌట్: 9 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్ కు అభేద్యమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్(10)ను త్వరగా కోల్పోయింది. రెండేళ్ల తర్వాత జట్టులోకొచ్చిన గౌతం గంభీర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో గంభీర్(29, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను కివీస్ బౌలర్ బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. పుజారా(41) మరోసారి రాణించాడు. అయితే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయి 100 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 37వ ఓవర్ నుంచి తొలి రోజు ఆట నిలిపివేసే వరకూ రహానే, కోహ్లీలు కివీస్ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు. వీరి అజేయ భాగస్వామ్యం (167)తో తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. కివీస్ బౌలర్లలో పటేల్, బౌల్ట్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.