'విరాట్ అలా చేయడం వల్లే'
బెంగళూరు:ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనకు అతను క్రీజ్ లో వేగంగా కదలడమే కారణమని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకూ విరాట్ ఆడిన మూడు ఇన్నింగ్స్ ల్లో రెండు సార్లు స్పిన్ కు అవుట్ కావడానికి క్రీజ్ లో ఎక్కువ స్పందిండమేనన్నాడు. బంతి గమనాన్ని క్రీజ్ లో ఉండి అంచనా వేస్తే సరిపోతుందని, బంతితో పాటు మనం మూవ్ కావాల్సిన అవసరం లేదని గవాస్కర్ తెలిపాడు.
'వరుస రెండు మ్యాచ్ ల్లో చూడండి. బంతిని విరాట్ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. బంతి టర్న్ అయ్యే విధానాన్ని , లైన్ ను సరిగా జడ్జ్ చేయలేకపోయాడు. ఆ రెండు సార్లు విరాట్ క్రీజ్ లో ఎక్కువగా కదిలాడు. ఆఫ్ స్టంప్ పైకి వెళ్లి మరీ అవుటయ్యాడు. అలా వేగంగా బంతితో పాటు వెళ్లాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. బంతి పిచ్ అయిన తరువాత ఒక అంచనాకు వస్తే చాలు. ఈ టెక్నిక్ ను విరాట్ మెరుగుపరుచుకుంటాడనే అనుకుంటున్నా. విరాట్ మానసికంగా చాలా స్ట్రాంగ్ కనుక గాడిలో పడటం అతనికి ఏమాత్రం కష్టం కాదు' అని గవాస్కర్ పేర్కొన్నాడు.