కోహ్లి దూకుడంటే ఇష్టం: గంగూలీ
ముంబై: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన నాయకుడని మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. అతని దూకుడు, వైఖరి అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ‘విరాట్ మంచి నాయకుడు. ఇంకా మంచి సారథిగా ఎదుగుతాడు. అయితే స్వదేశంలో కాకుండా విదేశాల్లో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొవాలి. మైదానంలో ఎప్పుడూ గెలవాలని కోరుకుంటాడు. ఈ దృక్పథం నాకు చాలా నచ్చుతుంది. ఆట అంటే కోహ్లికి అమితమైన ఆసక్తి. అతనిపై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది’ అని దాదా పేర్కొన్నాడు.
నాగ్‌పూర్ టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో పిచ్‌పై వస్తున్న విమర్శలపై గంగూలీ స్పందించాడు. ‘మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. బంతి కచ్చితంగా టర్న్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే బ్యాట్స్‌మెన్ మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. వికెట్ స్పిన్నర్లకు చాలా సహకరించింది. ఈసారే ఇలా జరిగింది. కాబట్టి భారత్ మరోసారి ఇలాంటి పిచ్‌లను రూపొందిస్తుందని నేను అనుకోవడం లేదు’ అని ఈ మాజీ సారథి వ్యాఖ్యానించాడు.