టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్‌లో కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది.
మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది.
ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు.
ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్‌కప్‌లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి.
సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు.
నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్‌కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.
చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’
Comments
Please login to add a commentAdd a comment