కోల్‌కతా: భారతదేశంలో ఉంటూ పరాయి దేశం వారిని పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఐదుసార్లు వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ స్పందించాడు. ఒక వ్యక్తి పరాయిదేశాన్ని పొగుడుతూ భారత్‌ను తక్కువ చేసి చూపించడం వల్లే కోహ్లి భావోద్వేగానికి గురై ఉండవచ్చన్నాడు. ఆ క్రమంలోనే తన నియంత్రణను కోల్పోయి పరాయి దేశం వెళ్లిపోవాల్సిందిగా సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చన్నాడు.
‘విరాట్ నియంత్రణ కోల్పోయాడనుకుంటా. కాస్త భావోద్వేగానికి గురై అలా ఆవేశాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. ఆ సమయంలో కోహ్లి మూడ్ సరిగా లేదనే అనుకుంటున్నా. ఆ విమర్శ చేసినప్పుడు అతడెలాంటి పరిస్థితిలో ఉన్నాడో? కాస్త సున్నితంగా, బలహీన క్షణాల్లో ఉన్నాడేమో. ఎంత నిగ్రహంగా ఉన్నా ఎప్పుడో ఓ సారి భావోద్వేగంతో కాస్త అతిగా స్పందిస్తుంటారు. నాకూ ఇలా జరగొచ్చు. ఇప్పటికే విరాట్‌పై చాలా విమర్శలొచ్చాయి. ఇక దీన్ని ఇక్కడితో ముగిస్తే మంచిది’ అని విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment