
టాప్–100లో కోహ్లి ఒక్కడే
న్యూయార్క్: తన ఆటద్వారా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆదాయంతో మరో ఘనతను సాధిం చాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న 100 మంది క్రీడాకారుల జాబితాలో 22 మిలియన్ డాలర్లతో (రూ. 141 కోట్లు) కోహ్లి 89వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ పత్రిక గురువారం ప్రకటించిన ఈ జాబితాలో భారత్ నుంచి కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకోవడం విశేషం.
కోహ్లి ఆర్జనలో 3 మిలియన్ డాలర్లు మ్యాచ్ ఫీజుల ద్వారా అందుకోగా, 19 మిలియన్ డాలర్లు ఎండార్స్‌మెంట్‌ల ద్వారా పొందడం గమనార్హం. 2016 జూన్ నుంచి 2017 జూన్ మధ్య ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించగా, క్రిస్టియానో రొనాల్డో 93 మిలియన్ డాలర్లతో (రూ. 636 కోట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.