దారుణ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి పరాభవం ఎదురైంది. గురువారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేనపై లంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లంకేయులను తేలికగా తీసుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. 'మా బౌలర్లను ఎంతగానో నమ్మాను. 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేం కాదు. బౌలర్లు ఎలాగైనా గెలిపిస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్ తో పాటు షాట్ సెలక్షన్ కూడా బాగుంది.
పాక్‌పై రాణించిన బౌలర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. లంకేయులు బ్యాట్‌తో చక్కని ప్రదర్శన చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నాను. కుషాల్ మెండిస్ (93 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్), ధనుష్క గుణతిలక (72 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) లు మా నుంచి మ్యాచ్‌ను దూరం చేశారు. మూడొందలకు పైచిలుకు స్కోరును కాపాడుకుంటామని భావించినా నిరాశే ఎదురైంది. బౌలర్లు తమ ఆలోచనకు మరింత పదును పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని' అభిప్రాయపడ్డాడు. భారత్ తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బి లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి.