డంకెన్ ఫ్లెచరే కారణం: కోహ్లి
మొహాలి:అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో నెగ్గుకు రావాలంటే ఫిట్నెస్ అనేది అత్యంత కీలకం. ఆ విషయాన్ని మన పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి ఎప్పుడో గ్రహించాడు. దానిలో భాగంగానే తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తునే ఉన్నాడు. ప్రధానంగా 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరువాత విరాట్ కోహ్లి ఫిట్నెస్ విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటివరకూ ఫిట్నెస్ను పెద్దగా పట్టించుకోని కోహ్లి.. నాలుగేళ్ల క్రితం ఐపీఎల్ అనంతరం తన ఆహార నియమావళి విషయంలో కఠినమైన పద్ధతులు అవలంభిస్తున్నాడు. అది తన సక్సెస్కు కారణమని గతంలో స్పష్టం చేసిన కోహ్లి.. అందుకు కారణం భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ డంకెన్ ఫ్లెచర్ అని తాజాగా పేర్కొన్నాడు. తొలుత తన ప్రతిభను గుర్తించిన డంకెన్ ఆ తరువాత తన ఫిట్ నెస్పై కూడా కొన్ని సూచనలు చేశాడని కోహ్లి గుర్తు చేసుకున్నాడు
'నీలో ప్రతిభ ఉంది. కానీ శిక్షణ విషయంలో నీవు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. ఒకవేళ నీవు మూడు ఫార్మాట్లలో అత్యున్నత స్థాయిలో ఉండాలంటే ఒక టెన్నిస్ ప్లేయర్ తరహాలో ట్రయన్ కావాలి. దానిలో భాగంగా నీ రోజువారీ వ్యాయమం. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలంటే కఠినమైన పద్ధతులను అవలంభించ తప్పదు. మనం ఫిట్గా ఉన్నప్పుడే మానసికంగా కూడా బలంగా ఉంటాం'అని ఫ్లెచర్ తనకు హితబోధ చేసినట్లు కోహ్లి పేర్కొన్నాడు. ఆ రోజు డంకెన్ చేసిన ఆ అమూల్యమైన సూచనే తన కెరీర్ ఎదుగుదలకు ఎంతగానే ఉపయోగపడిందని కోహ్లి అన్నాడు.
గతంలో తన రోజువారీ దినచర్య చాలా దారుణంగా ఉండేదని ఈ సందర్భంగా కోహ్లి పేర్కొన్నాడు. అసలు తిండి విషయంలో నియంత్రణ ఉండేది కాదనన్నాడు. రోజుకు రెండుసార్లు కూల్ డ్రింక్ తాగేవాడినని, అదే క్రమంలో రాత్రి పొద్దుపోయే వరకూ ఏదొకటి తింటూనే ఉండేవాడినని కోహ్లి తెలిపాడు. ప్రస్తుతం తన ట్రయనింగ్ చాలా కఠినంగా ఉన్నా, అది తన సక్సెస్ కారణమైందన్నాడు. గతంతో పోలిస్తే 11 నుంచి 12 కేజీల బరువు తగ్గినట్లు కోహ్లి అన్నాడు. అప్పుడు బొద్దుగా ఉండే తాను.. ఇప్పడు ప్రతీరోజు కఠినమైన శిక్షణను అవలంభిస్తున్నానని పేర్కొన్నాడు.