Duncan fletcher
-
డంకెన్ ఫ్లెచరే కారణం: కోహ్లి
మొహాలి:అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో నెగ్గుకు రావాలంటే ఫిట్నెస్ అనేది అత్యంత కీలకం. ఆ విషయాన్ని మన పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి ఎప్పుడో గ్రహించాడు. దానిలో భాగంగానే తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తునే ఉన్నాడు. ప్రధానంగా 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరువాత విరాట్ కోహ్లి ఫిట్నెస్ విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటివరకూ ఫిట్నెస్ను పెద్దగా పట్టించుకోని కోహ్లి.. నాలుగేళ్ల క్రితం ఐపీఎల్ అనంతరం తన ఆహార నియమావళి విషయంలో కఠినమైన పద్ధతులు అవలంభిస్తున్నాడు. అది తన సక్సెస్‌కు కారణమని గతంలో స్పష్టం చేసిన కోహ్లి.. అందుకు కారణం భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ డంకెన్ ఫ్లెచర్ అని తాజాగా పేర్కొన్నాడు. తొలుత తన ప్రతిభను గుర్తించిన డంకెన్ ఆ తరువాత తన ఫిట్ నెస్‌పై కూడా కొన్ని సూచనలు చేశాడని కోహ్లి గుర్తు చేసుకున్నాడు 'నీలో ప్రతిభ ఉంది. కానీ శిక్షణ విషయంలో నీవు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. ఒకవేళ నీవు మూడు ఫార్మాట్లలో అత్యున్నత స్థాయిలో ఉండాలంటే ఒక టెన్నిస్ ప్లేయర్ తరహాలో ట్రయన్ కావాలి. దానిలో భాగంగా నీ రోజువారీ వ్యాయమం. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే కఠినమైన పద్ధతులను అవలంభించ తప్పదు. మనం ఫిట్‌గా ఉన్నప్పుడే మానసికంగా కూడా బలంగా ఉంటాం'అని ఫ్లెచర్ తనకు హితబోధ చేసినట్లు కోహ్లి పేర్కొన్నాడు. ఆ రోజు డంకెన్ చేసిన ఆ అమూల్యమైన సూచనే తన కెరీర్ ఎదుగుదలకు ఎంతగానే ఉపయోగపడిందని కోహ్లి అన్నాడు. గతంలో తన రోజువారీ దినచర్య చాలా దారుణంగా ఉండేదని ఈ సందర్భంగా కోహ్లి పేర్కొన్నాడు. అసలు తిండి విషయంలో నియంత్రణ ఉండేది కాదనన్నాడు. రోజుకు రెండుసార్లు కూల్ డ్రింక్ తాగేవాడినని, అదే క్రమంలో రాత్రి పొద్దుపోయే వరకూ ఏదొకటి తింటూనే ఉండేవాడినని కోహ్లి తెలిపాడు. ప్రస్తుతం తన ట్రయనింగ్ చాలా కఠినంగా ఉన్నా, అది తన సక్సెస్ కారణమైందన్నాడు. గతంతో పోలిస్తే 11 నుంచి 12 కేజీల బరువు తగ్గినట్లు కోహ్లి అన్నాడు. అప్పుడు బొద్దుగా ఉండే తాను.. ఇప్పడు ప్రతీరోజు కఠినమైన శిక్షణను అవలంభిస్తున్నానని పేర్కొన్నాడు. -
మామ అంత్యక్రియల కోసం...దక్షిణాఫ్రికా వెళ్లిన ఫ్లెచర్
పెర్త్: భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ కొద్ది రోజుల పాటు జట్టుకు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మృతి చెందిన తన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఫ్లెచర్ బయల్దేరి వెళ్లారు. ఈ విషయాన్ని భారత టీమ్ మేనేజ్మెంట్ నిర్ధారించింది. జింబాబ్వేకు చెందిన ఫ్లెచర్ కుటుంబం కేప్‌టౌన్‌లోనే స్థిరపడింది. ఇక్కడి వాకా మైదానంలో శనివా రం యూఏ ఈతో తలపడనున్న ధోని సేన... వచ్చే శుక్రవారం ఇక్కడే వెస్టిండీస్‌ను ఎదుర్కొం టుంది. విండీస్‌తో మ్యాచ్‌లోగా డంకన్ తిరిగొచ్చే అవకాశం ఉంది. ఫ్లెచర్ గైర్హాజరీతో టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి మార్గదర్శనంలో అసిస్టెంట్ కోచ్‌లు సంజయ్ బం గర్, భరత్ అరుణ్, శ్రీధర్ ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తారు. -
ప్రపంచ కప్ వరకు టీమిండియా కోచ్ ఫ్లెచరే
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ డంకెన్ ఫ్లెచర్ పదవీకాలాన్ని పొడగించారు. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ పూర్తయ్యేవరకు కోచ్‌గా ఫ్లెచర్ కొనసాగనున్నాడు. బీసీసీఐ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్త ఆతిథ్యంలో ప్రపంచ కప్ నిర్వహించనున్నాయి. -
ఫ్లెచర్ ఒడ్డున పడ్డట్లే!
కోచ్‌పై రవిశాస్త్రి ప్రశంసల వర్షం లండన్: భారత క్రికెట్ కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ ప్రపంచకప్ దాకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటన మధ్యలో టీమ్ డెరైక్టర్‌గా వెళ్లిన రవిశాస్త్రి ఇచ్చే నివేదిక ఆధారంగా ఫ్లెచర్ భవిష్యత్‌ను నిర్ణయించాలని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తన నివేదిక బోర్డుకు ఇవ్వకముందే... మీడియాలో ఫ్లెచర్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. అంటే.. ఫ్లెచర్‌కు సానుకూలంగా శాస్త్రి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ‘ఫ్లెచర్ అద్భుతమైన వ్యక్తి. వంద టెస్టులకు పైగా కోచ్‌గా పని చేశారు. ఇది చాలా పెద్ద ఘనత. సాంకేతికంగా అతను చాలా దిట్ట. జట్టుకు తండ్రిలాంటి వారు. ప్రతి ఒక్కరిని బాగా గౌరవిస్తారు. 1983 ప్రపంచకప్ నుంచి నాకు ఫ్లెచర్ తెలుసు. 1984లో నేను అండర్-25 జట్టు సారథిగా జింబాబ్వేలో పర్యటించా. అప్పుడు జింబాబ్వే కెప్టెన్ ఆయనే. అప్పుడే ఫ్లెచర్ నాయకత్వ లక్షణాలను చూశా. ఇంగ్లండ్ టూర్లో బంగర్, భరత్ అరుణ్, శ్రీధర్‌లు కోచ్ పనిని చాలా సులువు చేశారు’ అని శాస్త్రి పేర్కొన్నారు. ఓ కోచ్‌గా ఫ్లెచర్ చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘నేను చూసినంత వరకు జట్టుకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. నేను ఇలా చెప్పడం వ్యక్తిగతంగా అతనికి లాభిస్తుందని విమర్శకులు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు’ అని టీమ్ డెరైక్టర్ వ్యాఖ్యానించారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌లో టెస్టు పరాజయాల తర్వాత కోచ్ పదవి ఊడుతుందని ఊహాగానాలు వచ్చినా... ప్రస్తుతం శాస్త్రి చలువతో ఫ్లెచర్ ఒడ్డున పడ్డట్లే కనిపిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువే టీమ్ డెరైక్టర్‌గా తాను ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం వచ్చిందని శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌పై వన్డేల్లో 3-1తో సిరీస్ గెలవడం చాలా పెద్ద ఘనత అన్నారు. ‘డ్రెస్సింగ్ రూమ్ ఆహ్లాదకరంగా ఉండేటట్లు చూశా. ఆటగాళ్లలో నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నించా. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడటంతో జట్టు పరిస్థితులు కూడా అనుకూలంగా మారాయి. మైదానంలో, బస్‌లో, బార్లో, డ్రెస్సింగ్ రూమ్‌లో, తినే దగ్గర.. ఇలా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో చాలాసేపు ఆట గురించి మాట్లాడా. ఏ విషయంలోనైనా చర్చలు చాలా ప్రధానమైనవి. నేను ఆడిన దానికంటే చూసిన క్రికెట్టే చాలా ఎక్కువ. క్రికెట్ మానేసిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ విషయాలనే ఆటగాళ్లకు చెప్పా’ అని శాస్త్రి వివరించారు. విరాట్ అర్థం చేసుకున్నాడు మానసిక, సాంకేతిక అంశాలతో బాగా ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లి తాను చెప్పిన మాటలను బాగా అర్థం చేసుకున్నాడన్నారు. ‘ఒకే బౌలర్ చేతిలో ఒకే రకంగా ఐదారుసార్లు అవుట్ కావడంతో కోహ్లిలో కాస్త నిరాశ చోటు చేసుకుంది. దానికి తోడు కొన్ని సమస్యలతో సతమతమయ్యాడు. అయితే ప్రతిదానికి పరిష్కారం ఉందని చెప్పా. బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని వివరించా. దాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా కసరత్తులు చేశాడు. ధావన్ కూడా ఇలాగే ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు’ అని శాస్త్రి తెలిపారు. టెస్టు సిరీస్ తర్వాత ధోనిపై నెలకొన్న ఒత్తిడిని తొలగించేలా చేయడంలో సఫలమయ్యానని చెప్పారు. అయితే జట్టుతో పాటు ఎన్నాళ్లూ కొనసాగుతాననే విషయాన్ని శాస్త్రి వెల్లడించలేదు. 2015 వరకు ఉండాలి: లక్ష్మణ్ వన్డే జట్టుకు పని చేసిన సహాయక సిబ్బందితో పాటు టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి, కోచ్ ఫ్లెచర్‌ను 2015 వరకు కొనసాగించాలని భారత మాజీ టెస్టు ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ‘ప్రపంచకప్ వరకు వీళ్లందర్ని కొనసాగించాలి. బీసీసీఐ దీనికి కట్టుబడాలి. టోర్నీకి ఇంకా ఆరు నెలల సమయమే ఉంది. మార్పులు చేర్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. శాస్త్రి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి. ఆటపై మంచి అవగాహన ఉంది. తన కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. సహాయక సిబ్బందికి మంచి ట్రాక్ రికార్డు ఉంది’ అని లక్ష్మణ్ వివరించారు. ఆస్ట్రేలియా వికెట్లపై ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి రోహిత్ శర్మనే సరైన ఓపెనర్ అని చెప్పాడు. రహానేను బ్యాకప్‌గా కొనసాగిస్తూ మిడిలార్డర్లో ఆడించాలన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన సురేశ్ రైనాపై లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. -
ధృఢమైన వ్యక్తిత్వం ఫ్లెచర్ సొంతం:రవిశాస్త్రి
లండన్: టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ ది ధృఢమైన వ్యక్తిత్వమని భారత మాజీ ఆటగాడు, టీం డైరెక్టర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ లో భారత పర్యటనకు సంబంధించి ఇరువురూ బీసీసీఐకు నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో రవిశాస్త్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన తరుణంలో టీంఇండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.రవిశాస్త్రి టీం ఇండియా సరికొత్త బాధ్యతలు చేపట్టిన అనంతరం ఫ్లెచర్ కు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఫ్లెచర్ విజయవంతమైన కోచ్ గా రవిశాస్త్రి అభివర్ణించాడు.'ఫ్లెచర్ ది ధృఢమైన వ్యక్తిత్వం. ఇంగ్లండ్ టూర్ లో మిశ్రమ ఫలితాలను టీమిండియాకు దక్కించుకుంది. టెస్ట్ సిరీస్ ను కోల్పోయినా.. వన్డే సిరీస్ ను చేజిక్కించుకుంది. కోచ్ గా ఫ్లెచర్ విజయవంతమైయ్యాడు. ఇప్పటికి ఆయన 100 టెస్టు మ్యాచ్ లకు కోచ్ గా వ్యవహరించాడు. సాంకేతికంగా ఆయన గొప్పవ్యక్తి ' అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. టీమిండియాకు ఆయనే కోచ్ గా వ్యవహరిస్తారని తెలిపాడు. తాను మాత్రం టీంఇండియా ఆటతీరును పర్యవేక్షించి..ఫ్లెచర్ కు సూచిస్తానన్నాడు. -
వర్కింగ్ కమిటీలో నివేదికలు!
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి భారత జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్, టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వేర్వేరు నివేదికలు ఇవ్వనున్నారు. బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో వీటిపై చర్చిస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బోర్డు సభ్యులు నివేదికలు పూర్తిగా చదివిన అనంతరం తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 26న ఈ సమావేశం జరగనుంది. టూర్ తొలి భాగంలో కోచ్‌గా ఫ్లెచర్ పూర్తి బాధ్యతలు నెరవేర్చగా, వన్డే సిరీస్ నుంచి శాస్త్రి కూడా జట్టుతో కలిశారు. 11న ఆర్సీఏ కేసు విచారణ బీసీసీఐ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై ఈ నెల 11న జైపూర్ జిల్లా కోర్టులో మరోసారి వాదనలు జరగనున్నాయి. లలిత్ మోడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ సస్పెండ్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆర్సీఏ కోర్టును ఆశ్రయించగా... ఆగస్టు 11న దీనిపై కోర్టులో విచారణ కూడా జరిగింది. -
టీమిండియా చీఫ్ కోచ్ ఫ్లెచరే!
లండన్:టీమిండియాలో తనకు తాజాగా కల్పించిన బాధ్యతతో చీఫ్ కోచ్ డంకెన్ ఫ్లెచర్ పదవికి ముప్పేమీ లేదని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. తాను టీమిండియా డైరెక్టర్ నియమితులైయ్యాక ఫ్లెచర్ పాత్ర నామమాత్రమే అన్న ప్రశ్రలకు రవిశాస్త్రి పై విధంగా స్పందించాడు. 'నేను టీమిండియా డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకోనున్నాను. ఇంగ్లండ్ లో భారత్ ఘోర ఓటమితో నాకు ఈ పదవిని అప్పజెప్పారు. ఆటగాళ్లకు సంబంధించి ప్రతీ నివేదిక నా వద్ద ఉంటుంది. అయితే ఇంగ్లండ్ సిరీస్ కు వరకూ మాత్రమే నన్ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ ఫ్లెచర్ పాత్ర ఏ మాత్రం తగ్గదు. అతను ఎప్పటిలానే చీఫ్ కోచ్ గా ఉంటారు'అని రవిశాస్త్రి తెలిపాడు. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌పైనే. చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ అధికారాలను కత్తిరించి.. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని నియమించడంతో ఈ భారత మాజీ కెప్టెన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 25న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో రవిశాస్త్రి సరికొత్త బాధ్యతలు చేపట్టబోతున్నా.. ఫ్లెచర్ పదవిలో ఎటువంటి మార్పులేదన్నారు. -
వెస్టిండీస్ తో సిరీస్ కు టీమిండియా కోచ్ దూరం!
న్యూఢిల్లీ: త్వరలో వెస్టిండీస్ తో భారత్ లో జరిగే సిరీస్ కు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దూరం కానున్నాడు. ఇంగ్లండ్ లో ఘోర వైఫల్యం అనంతరం ఫ్లెచర్ పై విమర్శల వెల్లువ ఉప్పెనలా వచ్చి పడటంతో అతను భారత్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రాధమిక సమాచారం. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ కు ఫ్లెచర్ అందుబాటులో ఉండకపోవచ్చని స్వయంగా బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ జట్టులోని లోపాలను సరిదిద్దేందుకు మాజీ ఆటగాడు రవిశాస్త్రిని టీమిండియా డైరెక్టర్ గా నియమించి ఫ్లెచర్ పాత్రను తగ్గించడంతోనే అతను భారత్ కోచ్ బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. 'వచ్చే సిరీస్ కు ముందుగానే ఫ్లెచర్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ అతను వెళ్లాలనుకుంటే బోర్డు ఆపే ప్రయత్నం చేయదు'అని ఆ అధికారి తెలిపారు. -
ఫ్లెచర్‌కు బీసీసీఐ మద్దతు
న్యూఢిల్లీ: ఇటీవలి భారత జట్టు వరుస పరాజయాలకు ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను బాధ్యుడిని చేసే ఆలోచన లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించబోమని స్పష్టం చేసింది. జట్టు పేలవ ప్రదర్శనపై చర్చించేందుకు బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో గురువారం కోచ్ ఫ్లెచర్ సమావేశమయ్యారు. ‘నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఫ్లెచర్‌కు బీసీసీఐ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆయన తొలగింపుపై ఎలాంటి చర్చ జరుగలేదు. ‘మీ శిక్షణ సామర్థ్యంపై మాకు నమ్మకముంది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు’ అని ఫ్లెచర్‌కు చెప్పాము. మా అధ్యక్షుడు ఆయన్ని హెచ్చరించాడనే విషయం అబద్ధం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఫ్లెచర్‌ను వెంటనే తొలగించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేస్తున్న డిమాండ్‌పై స్పందిస్తూ... అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని... ఈ విషయంలో బీసీసీఐ చేయాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. -
ద్రవిడ్ ఒప్పుకుంటాడా?
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 'గోడ'లా నిలబడి మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి టీమిండియాకు ఆశాకిరణంగా మారాడు. క్రీజ్‌ను అంటిపెట్టుకుని ఎన్నోసార్లు భారత క్రికెట్ జట్టును గట్టెక్కించిన ఈ సీనియర్ ఆటగాడి సేవలు మరోసారి టీమ్‌కు అవసరమయ్యాయి. బ్యాట్స్‌మన్, కెప్టెన్, కీపర్‌గా మైదానంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి సగౌరవంగా ఆట నుంచి నిష్క్రమించిన ద్రవిడ్‌ను మార్గదర్శకుడి పాత్ర పోషించాలంటున్నారు సీనియర్లు. కోచ్ అవతారం ఎత్తాలని అభిలషిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన తర్వాత ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రమే కొనసాగుతున్నాడు. గత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఎడిషన్‌లో ద్రవిడ్ ఆడడం లేదు. ఈ సీజన్లో ఆడడని గత ఏడాదే ద్రవిడ్ ప్రకటించాడు. అన్నట్టుగానే వైదొలగాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు రాయల్స్ పగ్గాలు అప్పజెప్పి తప్పుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు మెంటర్(మార్గదర్శకుడు)గా కొత్త పాత్రలోకి ప్రవేశించాడు ద్రవిడ్. ఇదిలావుంచితే వరుస పరాజయాల బాటలో పయనిస్తున్న టీమిండియాను గాడిలో పెట్టేందుకు రాహుల్ ద్రవిడ్‌ను చీఫ్ కోచ్‌గా నియమించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. టీమిండియాకు యువ కోచ్ అవసరమన్న గవార్కర్... అందుకు సరైన వ్యక్తి ద్రవిడ్ అని చెప్పారు. ప్రస్తుత కోచ్ ఫ్లెచర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారని అతడిని తప్పించి ద్రవిడ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించాలన్నారు. ద్రవిడ్ పట్ల అందరికీ గౌరవముందని, అతడి మాట స్టార్ ఆటగాళ్లు కూడా వింటారని అన్నారు. గవార్కర్ ప్రతిపాదనపై అటు బీసీసీఐ, ఇటు ద్రవిడ్ స్పందించలేదు. కోచ్‌గా నియమిస్తామని బీసీసీఐ ప్రతిపాదిస్తే ద్రవిడ్ కాదనకపోవచ్చు. ఆట కోసం తపించే ద్రవిడ్‌ను కోచ్‌గా పెడితే ఎవరూ వ్యతిరేకించకపోవచ్చు. అయితే కెప్టెన్‌గా రాణించలేకపోయిన ద్రవిడ్ కోచ్‌గా రాణిస్తాడా అన్న అనుమానం కలుగుతోంది. నాయకుడిగా నిలదొక్కులేకపోయిన ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఆట కోసం అతడు పడే కష్టం చూస్తే ఇటువంటి అనుమానాలకు తావుండదు. కోచ్ పదవిలో ద్రవిడ్ తప్పకుండా సత్తా చూపుతాడన్న నమ్మకాన్ని గవార్కర్ వ్యక్తం చేశారు. ద్రవిడ్‌ను కొత్త పాత్రలో చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. జట్టు వెనకుండి నడిపించే బాధ్యత ద్రవిడ్ కు దక్కుతుందో, లేదో చూడాలి. -
ఫ్లెచర్‌ను సాగనంపాల్సిందే...
భారత కోచ్‌పై గవాస్కర్ విమర్శ ముంబై: మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన విమర్శలను ఈసారి భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్‌పై ఎక్కుపెట్టారు. ఇటీవలి కాలంలో ధోని సేన చెప్పుకోదగిన విజయాలు సాధించలేకపోవడంతో ఆటగాళ్ల ఆటతీరుపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. అయితే కోచ్ ఫ్లెచర్ సమయం కూడా ముగింపు దశకు వచ్చిందని, జట్టుకు ఇప్పుడు యువ కోచ్ అవసరం చాలా ఉందని చెప్పారు. ‘భారత క్రికెట్ జట్టును చూస్తే అధోగతి దిశగా పయనిస్తుందని అనుకోవచ్చు. జట్టుకు కావాల్సింది ఇప్పుడు యువ కోచ్ సేవలు. అంతేకానీ కోచ్‌గా ఉన్నామనిపించే వ్యక్తి సేవలు కాదు. అయితే మైదానంలో ఆడే ఆటకు కోచ్‌ల పాత్ర పెద్దగా ఉండదని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ కొందరి వల్ల కచ్చితంగా జట్టు ఆటతీరుపై ప్రభావం ఉంటుంది. గతంలో ఆసీస్‌కు డారెన్ లీమన్... భారత్, దక్షిణాఫ్రికాలకు కిర్‌స్టెన్ చాలా ప్రభావాన్ని చూపారు. గ్యారీని ఆటగాళ్లు అమితంగా గౌరవించారు. ప్రాక్టీస్ అనేది ఎంత లాభమో ఆయనకు తెలుసు. ఆయన అనంతరం జట్టు కిందికి జారిపోతూనే ఉంది. ప్రస్తుతానికైతే జట్టు వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటుందని అభిమానులెవరూ ఆశించడం లేదు. మరో ఏడాది కాలం కోసం కోచ్‌ను మారిస్తే ఏం లాభమని కొందరు అడుగుతున్నారు. కానీ అలా జరుగకపోతే జట్టు ఇంకా దిగజారుతుంది’ అని గవాస్కర్ హెచ్చరించారు. -
భారత బౌలింగ్ కోచ్‌పై వేటు?
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతజట్టు వరుస పరాజయాల నేపథ్యంలో కోచ్ డంకన్ ఫ్లెచర్‌పై వేటు పడవచ్చని అంతా భావిస్తుండగా... బీసీసీఐ మాత్రం బౌలింగ్ కోచ్ జోయ్ డేవిస్‌ను తప్పించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సహాయక సిబ్బంది కాంట్రాక్టుల్ని మరో నెలలో సమీక్షించనున్న బోర్డు.. ప్రధాన కోచ్ ఫ్లెచర్‌ను, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీని 2015 ప్రపంచకప్ దాకా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కోచ్‌గా ఫ్లెచర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశాల్లో భారత్ కేవలం ఒక్క టెస్టు మ్యాచ్‌లో మాత్రమే గెలిచినా... బోర్డు ఆయన పట్ల సానుకూల ధోరణితోనే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రానున్న ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిజీ షెడ్యూలు ఉన్న నేపథ్యంలో జట్టుకు అసిస్టెంట్ కోచ్‌ను, ఎక్కువ సంఖ్యలో వైద్య సిబ్బందిని నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లలో ఒకరిని నియమించవచ్చు. శుక్రవారం భువనేశ్వర్‌లో బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత మార్పుల గురించి అధికారిక ప్రకటన రావచ్చు. సహాయక సిబ్బంది నియామకాలకు సంబంధించిన నిర్ణయాలను సాధారణంగా బోర్డు అధ్యక్షుడే తీసుకునే సంప్రదాయం ఉండగా... ఈసారి వర్కింగ్ కమిటీ నిర్ణయించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
విదేశాల్లో ఏం చేస్తున్నారు?
ధోని, ఫ్లెచర్‌లను వివరణ కోరనున్న బోర్డు న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు గత మూడేళ్లుగా విదేశీ గడ్డపై ఘోరంగా విఫలమవుతున్న భారత జట్టుపై బీసీసీఐ పెద్దలు దృష్టిపెట్టారు. అందులో భాగంగా కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్ల నుంచి వివరణ తీసుకోనున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఇద్దరిపై వేటు వేసే అవకాశం లేకపోయినా విదేశాల్లో ప్రదర్శన మెరుగుపడేందుకు అవసరమైన చర్యల గురించి తెలుసుకోనున్నారు. బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచకప్ తర్వాత ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ‘కోచ్, కెప్టెన్‌ను పిలిచి మాట్లాడాలనుకుంటున్నాం. ఇదంతా సర్వసాధారణం. ప్రతి పర్యటన తర్వాత ఈ తంతు ఉంటుంది. టి20 ప్రపంచకప్ తర్వాత ఇది ఉండొచ్చు. విదేశాల్లో ఎదురైన పరిస్థితుల గురించి, తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రదర్శన మెరుగుపడటానికి వారికేమీ కావాలో అడుగుతాం’ అని పటేల్ తెలిపారు. విదేశీ గడ్డపై ఫ్లెచర్ కోచింగ్‌లో... 15 టెస్టుల్లో భారత్ పదింటిలో ఓడగా, ధోని నాయకత్వంలో... 14 టెస్టుల్లో తొమ్మిదింటిలో పరాజయం పాలైంది. ఫ్లవర్‌తో చర్చలు! ఓవైపు ఫ్లెచర్ నుంచి వివరణ తీసుకోనున్న నేపథ్యంలో అతనిపై వేటు వేసే అవకాశం కూడా ఉందని మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్‌తో బీసీసీఐ చర్చలు జరుపుతోందని కూడా సమాచారం. అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని పటేల్ వివరణ ఇచ్చారు.