ఫ్లెచర్‌ను సాగనంపాల్సిందే...
భారత కోచ్‌పై గవాస్కర్ విమర్శ
ముంబై: మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన విమర్శలను ఈసారి భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్‌పై ఎక్కుపెట్టారు. ఇటీవలి కాలంలో ధోని సేన చెప్పుకోదగిన విజయాలు సాధించలేకపోవడంతో ఆటగాళ్ల ఆటతీరుపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. అయితే కోచ్ ఫ్లెచర్ సమయం కూడా ముగింపు దశకు వచ్చిందని, జట్టుకు ఇప్పుడు యువ కోచ్ అవసరం చాలా ఉందని చెప్పారు. ‘భారత క్రికెట్ జట్టును చూస్తే అధోగతి దిశగా పయనిస్తుందని అనుకోవచ్చు. జట్టుకు కావాల్సింది ఇప్పుడు యువ కోచ్ సేవలు. అంతేకానీ కోచ్‌గా ఉన్నామనిపించే వ్యక్తి సేవలు కాదు. అయితే మైదానంలో ఆడే ఆటకు కోచ్‌ల పాత్ర పెద్దగా ఉండదని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ కొందరి వల్ల కచ్చితంగా జట్టు ఆటతీరుపై ప్రభావం ఉంటుంది.
గతంలో ఆసీస్‌కు డారెన్ లీమన్... భారత్, దక్షిణాఫ్రికాలకు కిర్‌స్టెన్ చాలా ప్రభావాన్ని చూపారు. గ్యారీని ఆటగాళ్లు అమితంగా గౌరవించారు. ప్రాక్టీస్ అనేది ఎంత లాభమో ఆయనకు తెలుసు. ఆయన అనంతరం జట్టు కిందికి జారిపోతూనే ఉంది. ప్రస్తుతానికైతే జట్టు వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటుందని అభిమానులెవరూ ఆశించడం లేదు. మరో ఏడాది కాలం కోసం కోచ్‌ను మారిస్తే ఏం లాభమని కొందరు అడుగుతున్నారు. కానీ అలా జరుగకపోతే జట్టు ఇంకా దిగజారుతుంది’ అని గవాస్కర్ హెచ్చరించారు.