విదేశాల్లో ఏం చేస్తున్నారు?
ధోని, ఫ్లెచర్‌లను వివరణ కోరనున్న బోర్డు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు గత మూడేళ్లుగా విదేశీ గడ్డపై ఘోరంగా విఫలమవుతున్న భారత జట్టుపై బీసీసీఐ పెద్దలు దృష్టిపెట్టారు. అందులో భాగంగా కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్‌ల నుంచి వివరణ తీసుకోనున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఇద్దరిపై వేటు వేసే అవకాశం లేకపోయినా విదేశాల్లో ప్రదర్శన మెరుగుపడేందుకు అవసరమైన చర్యల గురించి తెలుసుకోనున్నారు. బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచకప్ తర్వాత ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ‘కోచ్, కెప్టెన్‌ను పిలిచి మాట్లాడాలనుకుంటున్నాం. ఇదంతా సర్వసాధారణం. ప్రతి పర్యటన తర్వాత ఈ తంతు ఉంటుంది.
టి20 ప్రపంచకప్ తర్వాత ఇది ఉండొచ్చు. విదేశాల్లో ఎదురైన పరిస్థితుల గురించి, తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రదర్శన మెరుగుపడటానికి వారికేమీ కావాలో అడుగుతాం’ అని పటేల్ తెలిపారు. విదేశీ గడ్డపై ఫ్లెచర్ కోచింగ్‌లో... 15 టెస్టుల్లో భారత్ పదింటిలో ఓడగా, ధోని నాయకత్వంలో... 14 టెస్టుల్లో తొమ్మిదింటిలో పరాజయం పాలైంది.
ఫ్లవర్‌తో చర్చలు!
ఓవైపు ఫ్లెచర్ నుంచి వివరణ తీసుకోనున్న నేపథ్యంలో అతనిపై వేటు వేసే అవకాశం కూడా ఉందని మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్‌తో బీసీసీఐ చర్చలు జరుపుతోందని కూడా సమాచారం. అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని పటేల్ వివరణ ఇచ్చారు.