న్యూఢిల్లీ: క్రికెట్ ఫార్మాట్లను బట్టి నిర్ణయాలను తీసుకోవాలని టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. బుధవారం మాస్టర్‌కార్డ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోనీ మాట్లాడుతూ.. ‘టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు ఉంటాయి. మనం నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం ఉంటుంది. కానీ పొట్టి ఫార్మాట్ దీనికి పూర్తిగా భిన్నం. ఏ నిర్ణయమైనా క్షణాల్లోనే తీసుకోవాలి. కొన్ని పొరపాట్ల వల్ల ప్రణాళిక ఫలించకపోవచ్చు. కానీ ప్రత్యర్థిపై గెలవడమే అంతిమలక్ష్యం. ఆటగాడిగా తమ బాధ్యతను అందరూ పరిపూర్ణంగా నిర్వర్తించాలి. అందుకే క్రికెట్లో ఫార్మాట్లను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి’అని ధోనీ పేర్కొన్నాడు.
భావోద్వేగాలు నాకూ ఉన్నాయి...
మైదానంలో అందరిలానే అసహనం, కోపం తనకీ వస్తాయని మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొందిన ధోనీ అన్నాడు. కానీ భావోద్వేగాలను నియంత్రించుకోగలనని పేర్కొన్నాడు. ‘అందరిలానే నాకూ భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని నేను ఇతరుల కంటే బలంగా నియంత్రించుకోగలను. మైదానంలో ఎన్నోసార్లు నిరాశకు గురయ్యా. కోపం, అసహనం కూడా వచ్చేవి. కానీ ఆ క్షణంలో నా భావోద్వేగాల కంటే జట్టును నడిపించడమే ముఖ్యం. దీంతో వాటిని అధిగమించి మ్యాచ్‌పై దృష్టి పెట్టాను. తర్వాత బంతిని ఎవరికి అందివ్వాలి? బరిలోకి ఎవరిని దించాలి? అనే వాటిని ఎక్కువగా ఆలోచిస్తా. దీంతో భావోద్వేగాల గురించి మర్చిపోతా’అని ధోని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment