భారత బౌలింగ్ కోచ్‌పై వేటు?
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతజట్టు వరుస పరాజయాల నేపథ్యంలో కోచ్ డంకన్ ఫ్లెచర్‌పై వేటు పడవచ్చని అంతా భావిస్తుండగా... బీసీసీఐ మాత్రం బౌలింగ్ కోచ్ జోయ్ డేవిస్‌ను తప్పించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
సహాయక సిబ్బంది కాంట్రాక్టుల్ని మరో నెలలో సమీక్షించనున్న బోర్డు.. ప్రధాన కోచ్ ఫ్లెచర్‌ను, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీని 2015 ప్రపంచకప్ దాకా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కోచ్‌గా ఫ్లెచర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశాల్లో భారత్ కేవలం ఒక్క టెస్టు మ్యాచ్‌లో మాత్రమే గెలిచినా... బోర్డు ఆయన పట్ల సానుకూల ధోరణితోనే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రానున్న ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిజీ షెడ్యూలు ఉన్న నేపథ్యంలో జట్టుకు అసిస్టెంట్ కోచ్‌ను, ఎక్కువ సంఖ్యలో వైద్య సిబ్బందిని నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉంది.
అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లలో ఒకరిని నియమించవచ్చు. శుక్రవారం భువనేశ్వర్‌లో బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత మార్పుల గురించి అధికారిక ప్రకటన రావచ్చు. సహాయక సిబ్బంది నియామకాలకు సంబంధించిన నిర్ణయాలను సాధారణంగా బోర్డు అధ్యక్షుడే తీసుకునే సంప్రదాయం ఉండగా... ఈసారి వర్కింగ్ కమిటీ నిర్ణయించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.