ఫ్లెచర్ ఒడ్డున పడ్డట్లే!
కోచ్‌పై రవిశాస్త్రి ప్రశంసల వర్షం
లండన్: భారత క్రికెట్ కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ ప్రపంచకప్ దాకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటన మధ్యలో టీమ్ డెరైక్టర్‌గా వెళ్లిన రవిశాస్త్రి ఇచ్చే నివేదిక ఆధారంగా ఫ్లెచర్ భవిష్యత్‌ను నిర్ణయించాలని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తన నివేదిక బోర్డుకు ఇవ్వకముందే... మీడియాలో ఫ్లెచర్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. అంటే.. ఫ్లెచర్‌కు సానుకూలంగా శాస్త్రి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ‘ఫ్లెచర్ అద్భుతమైన వ్యక్తి. వంద టెస్టులకు పైగా కోచ్‌గా పని చేశారు.
ఇది చాలా పెద్ద ఘనత. సాంకేతికంగా అతను చాలా దిట్ట. జట్టుకు తండ్రిలాంటి వారు. ప్రతి ఒక్కరిని బాగా గౌరవిస్తారు. 1983 ప్రపంచకప్ నుంచి నాకు ఫ్లెచర్ తెలుసు. 1984లో నేను అండర్-25 జట్టు సారథిగా జింబాబ్వేలో పర్యటించా. అప్పుడు జింబాబ్వే కెప్టెన్ ఆయనే. అప్పుడే ఫ్లెచర్ నాయకత్వ లక్షణాలను చూశా. ఇంగ్లండ్ టూర్‌లో బంగర్, భరత్ అరుణ్, శ్రీధర్‌లు కోచ్ పనిని చాలా సులువు చేశారు’ అని శాస్త్రి పేర్కొన్నారు. ఓ కోచ్‌గా ఫ్లెచర్ చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘నేను చూసినంత వరకు జట్టుకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు.
నేను ఇలా చెప్పడం వ్యక్తిగతంగా అతనికి లాభిస్తుందని విమర్శకులు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు’ అని టీమ్ డెరైక్టర్ వ్యాఖ్యానించారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌లో టెస్టు పరాజయాల తర్వాత కోచ్ పదవి ఊడుతుందని ఊహాగానాలు వచ్చినా... ప్రస్తుతం శాస్త్రి చలువతో ఫ్లెచర్ ఒడ్డున పడ్డట్లే కనిపిస్తోంది.
ఊహించిన దానికంటే ఎక్కువే
టీమ్ డెరైక్టర్‌గా తాను ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం వచ్చిందని శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌పై వన్డేల్లో 3-1తో సిరీస్ గెలవడం చాలా పెద్ద ఘనత అన్నారు. ‘డ్రెస్సింగ్ రూమ్ ఆహ్లాదకరంగా ఉండేటట్లు చూశా. ఆటగాళ్లలో నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నించా. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడటంతో జట్టు పరిస్థితులు కూడా అనుకూలంగా మారాయి. మైదానంలో, బస్‌లో, బార్‌లో, డ్రెస్సింగ్ రూమ్‌లో, తినే దగ్గర.. ఇలా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో చాలాసేపు ఆట గురించి మాట్లాడా. ఏ విషయంలోనైనా చర్చలు చాలా ప్రధానమైనవి. నేను ఆడిన దానికంటే చూసిన క్రికెట్టే చాలా ఎక్కువ. క్రికెట్ మానేసిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ విషయాలనే ఆటగాళ్లకు చెప్పా’ అని శాస్త్రి వివరించారు.
విరాట్ అర్థం చేసుకున్నాడు
మానసిక, సాంకేతిక అంశాలతో బాగా ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లి తాను చెప్పిన మాటలను బాగా అర్థం చేసుకున్నాడన్నారు. ‘ఒకే బౌలర్ చేతిలో ఒకే రకంగా ఐదారుసార్లు అవుట్ కావడంతో కోహ్లిలో కాస్త నిరాశ చోటు చేసుకుంది. దానికి తోడు కొన్ని సమస్యలతో సతమతమయ్యాడు. అయితే ప్రతిదానికి పరిష్కారం ఉందని చెప్పా. బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని వివరించా. దాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా కసరత్తులు చేశాడు. ధావన్ కూడా ఇలాగే ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు’ అని శాస్త్రి తెలిపారు. టెస్టు సిరీస్ తర్వాత ధోనిపై నెలకొన్న ఒత్తిడిని తొలగించేలా చేయడంలో సఫలమయ్యానని చెప్పారు. అయితే జట్టుతో పాటు ఎన్నాళ్లూ కొనసాగుతాననే విషయాన్ని శాస్త్రి వెల్లడించలేదు.
2015 వరకు ఉండాలి: లక్ష్మణ్
వన్డే జట్టుకు పని చేసిన సహాయక సిబ్బందితో పాటు టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి, కోచ్ ఫ్లెచర్‌ను 2015 వరకు కొనసాగించాలని భారత మాజీ టెస్టు ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ‘ప్రపంచకప్ వరకు వీళ్లందర్ని కొనసాగించాలి. బీసీసీఐ దీనికి కట్టుబడాలి. టోర్నీకి ఇంకా ఆరు నెలల సమయమే ఉంది. మార్పులు చేర్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. శాస్త్రి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి. ఆటపై మంచి అవగాహన ఉంది. తన కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
సహాయక సిబ్బందికి మంచి ట్రాక్ రికార్డు ఉంది’ అని లక్ష్మణ్ వివరించారు. ఆస్ట్రేలియా వికెట్లపై ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి రోహిత్ శర్మనే సరైన ఓపెనర్ అని చెప్పాడు. రహానేను బ్యాకప్‌గా కొనసాగిస్తూ మిడిలార్డర్‌లో ఆడించాలన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన సురేశ్ రైనాపై లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు.