ధృఢమైన వ్యక్తిత్వం ఫ్లెచర్ సొంతం:రవిశాస్త్రి
లండన్: టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ ది ధృఢమైన వ్యక్తిత్వమని భారత మాజీ ఆటగాడు, టీం డైరెక్టర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ లో భారత పర్యటనకు సంబంధించి ఇరువురూ బీసీసీఐకు నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో రవిశాస్త్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన తరుణంలో టీంఇండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.రవిశాస్త్రి టీం ఇండియా సరికొత్త బాధ్యతలు చేపట్టిన అనంతరం ఫ్లెచర్ కు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటూ వార్తలు వినిపించాయి.
అయితే ఫ్లెచర్ విజయవంతమైన కోచ్ గా రవిశాస్త్రి అభివర్ణించాడు.'ఫ్లెచర్ ది ధృఢమైన వ్యక్తిత్వం. ఇంగ్లండ్ టూర్ లో మిశ్రమ ఫలితాలను టీమిండియాకు దక్కించుకుంది. టెస్ట్ సిరీస్ ను కోల్పోయినా.. వన్డే సిరీస్ ను చేజిక్కించుకుంది. కోచ్ గా ఫ్లెచర్ విజయవంతమైయ్యాడు. ఇప్పటికి ఆయన 100 టెస్టు మ్యాచ్ లకు కోచ్ గా వ్యవహరించాడు. సాంకేతికంగా ఆయన గొప్పవ్యక్తి ' అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. టీమిండియాకు ఆయనే కోచ్ గా వ్యవహరిస్తారని తెలిపాడు. తాను మాత్రం టీంఇండియా ఆటతీరును పర్యవేక్షించి..ఫ్లెచర్ కు సూచిస్తానన్నాడు.