![Virat Kohli, Rohit Sharma Mourn Kobe Bryant - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/27/Virat-Kohli.jpg.webp?itok=ROGOnOzs)
కాలిఫోర్నియా: హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం, కోచ్ కోబ్ బ్రియాంట్ దుర్మరణం చెందడంపై ఒక్కసారిగా క్రీడాలోకం షాక్‌కు గురైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్రియాంట్ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘ ఈ వార్త వినడం దురదృష్టకరం. ఇది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితం అనేది ఊహించలేనిది. ఆ ప్రమాదంలో బ్రియాంట్‌తో పాటు అతని కుమార్తె కూడా మృతి చెందడం కలిచివేస్తోంది. వారి ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ‘ ఇది క్రీడా ప్రపంచం మొత్తానికి దుర్దినం. ఒక దిగ్గజాన్ని క్రీడాలోకం కోల్పోయింది. బ్రియాంట్, అతని కుమార్తె గియానా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సంతాపం తెలిపాడు. (ఇక్కడ చదవండి: బాస్కెట్‌బాల్ దిగ్గజం దుర్మరణం)
ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బ్రియాంట్, కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్‌బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం తమకు తీరని లోటని సంతాపం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment