ఆనాటి ధోని కనిపించాడు!
న్యూఢిల్లీ:న్యూజిలాండ్తో మొహాలీలో జరిగిన మూడో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిలపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లిలోనే కచ్చితత్వమే అతని బ్యాటింగ్ను స్థాయిని అమితంగా పెంచిందని కొనియాడాడు. కోహ్లి బుద్ధి ఒక కంప్యూటర్ తరహాలో పని చేస్తుందనడానికి మూడో వన్డేలో ఆడిన ఇన్నింగ్సే ఉదాహరణగా గవాస్కర్ తెలిపాడు.
'కోహ్లి బుద్ధి చాలా సూక్ష్మంగా పని చేస్తుంది. ఒక కంప్యూటర్ ఎలా పని చేస్తుందో అదే తరహాలో అతని బుద్ధి వేగం కూడా ఎక్కువ. ఫీల్డర్లను మోహరించిన చోట కూడా అతని కచ్చితమైన కొలతలతో కొట్టే షాట్లు ఫీల్డర్లనే అయోమయంలో నెడుతుంటాయి. ఆ రకమైన ఆట తీరే అతను భారీ స్కోర్లు సాధించడానికి ఉపయోగపడుతుంది' అని గవాస్కర్ తెలిపాడు. దాంతో పాటు క్రికెట్ ఫీల్డ్లో కోహ్లి ప్రవర్తించే తీరు చాలా హుందాగా ఉంటుందన్నాడు. అభిమానుల్ని, ప్రజల్ని ఆప్యాయంగా పలకరించే తీరే అతనిలో మానవీయ లక్షణాలను తెలుపుతుందన్నాడు. ప్రస్తుత క్రికెట్ లో యువ క్రికెటర్లకు కోహ్లి ఒక రోల్ మోడల్ అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంచితే నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ను చేశాడన్నాడు. 'ధోని నాల్గో స్థానంలో బ్యాటింగ్ రావడానికి అతనే కారణం. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ లో వెనుకబడిపోతామనే విషయం ధోనికి తెలుసు. ఆ స్థానంలో బ్యాటింగ్ రావాల్సి ఉన్న మనీష్ పాండే, కేదర్ జాదవ్లు టాలెంట్ ఉన్న క్రికెటర్లే. కానీ వారికి అనుభవం తక్కువ. దాంతో ఆస్థానంలో బ్యాటింగ్ కు రావాలని ధోని తీసుకున్న నిర్ణయం సరైనది. 2011లో వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కూడా ధోని ఇలానే ముందుకు వచ్చాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ రావాల్సిన యువరాజ్ ను పక్కకు పెట్టి, ధోని వచ్చాడు. పటిష్టమైన శ్రీలంక ఎటాక్ ను ఎదుర్కొనే క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చాడు. న్యూజిలాండ్ తో మూడో వన్డేలో కూడా ఆనాటి ధోని కనిపించాడు. అప్పటి బాధ్యత ధోనిలో మరోసారి కనిపించింది' అని గవాస్కర్ అన్నాడు.