అదే మా ప్రణాళిక: విరాట్ కోహ్లి
కాన్పూర్:ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ను, వన్డే సిరీస్ను గెలిచిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాకు ట్వంటీ 20 సిరీస్ ఆదిలోనే చుక్కెదురైంది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా గురువారం ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. టీమిండియా బ్యాటింగ్ సమతుల్యంగా లేకపోవడంతోనే ఓటమి ఎదురైందనే వాదన వినిపిస్తోంది.
ప్రధానంగా ఓపెనర్గా విరాట్ కోహ్లి బ్యాటింగ్ కు రావడంపై చర్చ జరిగింది. గతంలో అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్ లో ఒకసారి మాత్రమే వచ్చిన విరాట్.. దాదాపు నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓపెనర్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 29 పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించినా, అతని స్థాయి బ్యాటింగ్కు అందుకోలేకపోయాడు. కాగా, తాను ఓపెనర్గా రావడాన్ని కోహ్లి సమర్ధించుకున్నాడు.
'నేను ఓపెనర్గా రావడంలో ప్రత్యేకత ఏమీ లేదు. నా ఓపెనింగ్తో జట్టుకు వచ్చిన ఇబ్బందికూడా ఏమీ లేదు. ప్రతీఒక్కరికీ ఒక్కో రకమైన అంచనా ఉంటుంది. ఆ క్రమంలోనే నేను ఓపెనింగ్ కు వచ్చా. గత ఐపీఎల్ సీజన్లో నేను ఓపెనర్గా వచ్చి సక్సెస్ అయ్యా. దాన్ని దృష్టిలో్ పెట్టుకునే నేను ఓపెనింగ్కు వచ్చా. అది జట్టు ప్రణాళికలో ఒక భాగం. ఓపెనర్గా రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతోనే నేను ఆ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది.
మిడిల్ ఆర్డర్లో సురేశ్ రైనా లాంటి ఆటగాడితో జట్టు సమతుల్యంగా ఉంది. నాకు స్థానాలతో పట్టింపులేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఓపెనర్గా దిగితేనే జట్టు పటిష్టంగా ఉంటుంది. ఆ కారణం చేతే నేను ఓపెనర్గా దిగాల్సి వచ్చింది. గతంలో నేను ఓపెనర్గా విఫలమై ఉంటే నన్ను తప్పుపట్టవచ్చు. ఐపీఎల్ తో పాటు, అంతకుముందు నేను ఓపెనర్గా వచ్చిన ట్వంటీ 20లోనూ రాణించా. అటువంటప్పుడు నా ఓపెనింగ్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు' అని కోహ్లి తెలిపాడు.