న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విట్టర్‌లో స్పందించాడు. ముందు జాగ్రత్త చర్యలతో వైరస్ రాకుండా చూసుకోవడంతో పాటు ఇతరులకు వ్యాప్తి చెందకుండా వ్యవహరించాలని సందేశమిచ్చాడు. ‘ఇలాంటి సమయంలోనే మనమంతా దృఢచిత్తంతో ఉండాలి. కోవిడ్–19పై పోరాడాలి. వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండండి. నేను చెప్పేది గుర్తుంచుకోండి. వచ్చాక నివారించడం కంటే రాకుండా నిరోధించడమే ఉత్తమం’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. శుక్రవారం భారత కెప్టెన్ లక్నో విమానాశ్రయంలో ముఖానికి నలుపు మాస్క్‌తో కనిపించాడు. భారత దిగ్గజం, హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ట్విట్టర్ వేదికగా జాగ్రత్తలు సూచించాడు. ‘అందరికీ విన్నపం. ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలి. లక్షణాలుంటే... పరీక్ష చేసుకోవాలి. పాజిటివ్ రిపోర్ట్ వస్తే... బయటికి రాకుండా, ఇంకొకరికి సోకకుండా ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకోవాలి. కలిసికట్టుగా కోవిడ్–19పై విజయం సాధించాలి’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment