సెంచూరియన్: సమకాలీన క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా స్టీవ్ స్మిత్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కోహ్లి సెంచరీ చేయడం ద్వారా స్మిత్ రికార్డును బ్రేక్ చేశాడు. గత ఏడేళ్ల కాలంలో కోహ్లి (టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూస్తే) విదేశాల్లో నమోదు చేసిన సెంచరీల సంఖ్య 11 కాగా, ఈ వ్యవధిలో స్టీవ్ స్మిత్ విదేశీ టెస్టు సెంచరీల సంఖ్య 10గా ఉంది. దాంతో ఒక ఆటగాడిగా ఓవర్‌సీస్ సెంచరీల రికార్డును కోహ్లి మరింత మెరుగుపరుచున్నాడు. అదే సమయంలో రికార్డుల మోత మోగించాడు.
తన టెస్టు కెరీర్‌లో 21 సెంచరీ సాధించిన కోహ్లి.. టీమిండియా కెప్టెన్‌గా 14 సెంచరీలు సాధించాడు. దాంతో 14 సెంచరీలు సాధించిన దిగ్గజ కెప్టెన్లు.. డాన్ బ్రాడ్‌మాన్, లారా, జయవర్ధనే, క్లార్క్‌ల సరసన విరాట్ నిలిచాడు. ఇందులో విదేశాల్లో కోహ్లి 7 సెంచరీలు సాధించగా, స్వదేశంలో కూడా 7 శతకాలు ఉండటం విశేషం. మరొకవైపు సచిన్ టెండూల్కర్ తర్వాత దక్షిణాఫ్రికాలో శతకం బాదిన టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఖ్యాతికెక్కాడు.
కేప్‌టౌన్‌లో 1996లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 169 పరుగులు సాధించాడు. ఆపై దాదాపు రెండు దశాబ్దాలు తరువాత సఫారీ గడ్డపై టెస్టు సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. భారత కెప్టెన్‌గా విదేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన వారిలో కోహ్లి ముందున్నాడు. అజారుద్దీన్(5), సచిన్(4), ద్రవిడ్(4), గంగూలీ(3) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సచిన్‌ను దాటేశాడు..
టెస్టుల్లో అత్యంత వేగంగా 21 సెంచరీలు సాధించిన వారిలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ను అధిగమించి అతడీ ఘనత సాధించాడు. సచిన్ 110 ఇన్నింగ్స్‌లో 21 సెంచరీలు పూర్తి చేయగా, కోహ్లి 109 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. డాన్ బ్రాడ్‌మన్(56 ఇన్నింగ్స్), సునీల్ గవాస్కర్(98), స్టీవ్ స్మిత్(105) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఆమ్లా రికార్డు కూడా..
ఓవరాల్‌గా చూస్తే కోహ్లికి ఇది 53వ సెంచరీ(వన్డేల్లో 32, టెస్టుల్లో 21). దాంతో అత్యంత వేగవంతంగా ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఇక్కడ ఆమ్లా పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. తన కెరీర్‌లో ఆమ్లా 53 సెంచరీలు చేయడానికి 380 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కోహ్లి 354 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment