శిఖరాన విరాట్‌ | Virat Number one in the ICC Test rankings | Sakshi
Sakshi News home page

శిఖరాన విరాట్‌

Published Mon, Aug 6 2018 1:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Virat Number one in the ICC Test rankings - Sakshi

దుబాయ్‌: భారత స్టార్‌ బ్యాట్స్‌మన్, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన అద్భుత కెరీర్‌లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి చిరస్మరణీయ బ్యాటింగ్‌ తర్వాత కూడా భారత్‌ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో 149, 51 పరుగుల ప్రదర్శన కోహ్లిని అగ్రస్థానానికి చేర్చింది. 934 రేటింగ్‌ పాయింట్లతో విరాట్‌ శిఖరాన నిలబడగా, 929 పాయింట్లతో స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) రెండో స్థానానికి పడిపోయాడు. 2015 డిసెంబర్‌ నుంచి నంబర్‌వన్‌గా ఉన్న స్మిత్‌... బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో గత మార్చి నుంచి టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగలేదు.
 

గతంలో భారత్‌ తరఫున సునీల్‌ గావస్కర్, దిలీప్‌ వెంగ్సర్కార్, సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. 2011 జూన్‌లో సచిన్‌ చివరిసారిగా అగ్రస్థానం సాధించిన తర్వాత ఒక భారత బ్యాట్స్‌మన్‌ ఈ మైలురాయిని చేరడం ఇదే మొదటిసారి. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాను చూస్తే కోహ్లి (934) ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్నాడు. ఇందులో డాన్‌ బ్రాడ్‌మన్‌ 1948లో సాధించిన 961 పాయింట్లు అత్యుత్తమం కాగా... స్మిత్‌ (947)ది రెండో స్థానం. కోహ్లి ఇప్పటికే వన్డేల్లో కూడా ఎవరికీ అందనంత ఎత్తులో 911 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement