
బౌన్సర్లు నిషేధిస్తే మజా పోతుంది: సెహ్వాగ్
ముంబై: ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఓ బౌన్సర్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఇలాంటి బంతులపై నిషేధం విధించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఐసీసీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. నిషేధం అంటూ విధిస్తే క్రికెట్‌లో మజా పోతుందని చెప్పాడు.
‘పుల్ షాట్ ఆడబోయి బంతి తలకు తగిలి హ్యూస్ చనిపోవడం నిజంగా విచార కరం. అయితే ఇదంతా క్రికెట్ జీవితంలో ఓ భాగం. ఏ క్రీడలో అయినా గాయాలపాలవడ ంతో పాటు కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా. అలా అని ప్రమాదకర బౌన్సర్లను తొలగిస్తే అది పూర్తిగా బ్యాట్స్‌మెన్ గేమ్ అయిపోతుంది. నా కెరీర్‌లో కూడా చాలా బౌన్సర్లు హెల్మెట్‌కు తాకాయి’ అని వీరూ అన్నాడు.
ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఉంటానేమో..!
జాతీయ జట్టుకు దూరమై దాదాపు రెండేళ్లు కావస్తున్నప్పటికీ ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కడంపై 36 ఏళ్ల సెహ్వాగ్ ఆశాభావంతోనే ఉన్నాడు. ‘30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాలో నా పేరు ఉంటుందనే ఆశిస్తున్నాను. ప్రతీ క్రికెటర్‌లాగే నాకు కూడా మళ్లీ ప్రపంచకప్‌లో ఆడాలనే ఉంది. ఈసారి భారత్ కప్‌ను నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆసీస్ పర్యటనలో ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా మన ఆటగాళ్లు మాత్రం బాగానే రాణిస్తారని అనుకుంటున్నాను’ అని ప్రపంచకప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ పేర్కొన్నాడు.