
భయానికే మీనింగ్ తెలియని క్రికెటర్.. ఓపెనర్ అంటే ఇలానే ఆడాలని కొత్త నిర్వచనం చెప్పిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. సెంచరీ చెరువలో ఉన్నా బంతిని బౌండరీకి తరలించే సాహసి.. ప్రతి బంతిని బ్యాట్‌తో బాది ప్రేక్షకులను అలరించడమే నా ధ్యేయమని చెప్పిన త్రిశతక వీరుడు.. అతడే మన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతని బ్యాటింగ్ రికార్డులు ఒక ఎత్తయితే .. వివాద రహితుడిగా కెరీర్‌ను కొనసాగించడం మరో ఎత్తు.. సీనియర్లకు తమ్ముడిలా.. జూనియర్లకు పెద్దన్నలా.. క్రమశిక్షణతో వ్యవహరించడం అతనికే సాధ్యం. నేడు 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ లెజెండ్ గురించి మరిన్ని విశేషాలు..
సచిన్ గాయంతో ఓపెనర్‌గా..
దాయాది పాకిస్తాన్‌పై 1999లో అరంగేట్రం చేసిన సెహ్వాగ్ తొలి రోజుల్లో ఆశించినంతగా రాణించలేదు. తొలి వన్డేలో ఒక్కపరుగుకే అవుటయ్యాడు. అతని నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కీలక ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో 58 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 2001 న్యూజిలాండ్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో సెహ్వాగ్‌కు ఓపెనింగ్ అవకాశం లభించింది. ఇక ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌పై 69 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదే అతని తొలి సెంచరీ కావడం విశేషమైతే.. భారత తరుపున రెండో వేగవంతమైన సెంచరీ. ఈ ఘనతతో జట్టులో రెగ్యులర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగాడు. అంతేగాకుండా సచిన్‌ను మిడిలార్డర్‌కు పంపించి సెహ్వాగ్‌ను ఓపెనింగ్ పంపించడం మొదలెట్టారు.
2003 ప్రపంచ కప్ ..
సెహ్వాగ్ కెరీర్‌లో 2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓ మైలు రాయి. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 360 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడంలో భారత్ ఆటగాళ్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడ్డారు. ఒకవైపు వికెట్లు పడుతున్న తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ ద్రవిడ్‌తో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరగడంతో భారత అభిమానుల ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. కానీ 10 ఫోర్లు..3 సిక్పర్లతో సెహ్వాగ్ చేసిన 82 పరుగులు అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ టోర్నీలో మొత్తం సెహ్వాగ్ 299 పరుగులు చేశాడు.
ముల్తాన్ సుల్తాన్..
ముల్తాన్ వేదికగా పాక్‌పై సెహ్వాగ్ 2004లో ట్రిఫుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇది అతని కెరీర్‌లో తొలి ట్రిఫుల్ సెంచరీకాగా.. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగమైన ట్రిఫుల్ సెంచరీ కూడా ఇదే. ఇక ఈ ట్రిఫుల్ సెంచరీని సిక్సర్‌తో సాధించడం మరో విశేషం. ఈ సిరీస్‌లో సెహ్వాగ్ రెచ్చిపోయి ఆడటంతో అప్పటి పాక్ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్ మా సింహా స్వప్నం సెహ్వాగే అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
కెప్టెన్‌గా..
సెహ్వాగ్ 2006 లాస్‌ఏంజిల్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌గెలిచింది. సెహ్వాగ్ వన్డే, టెస్టులకు వైస్‌కెప్టెన్సీ హోదాలో కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. టెస్టుల్లో 4 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా భారత్ 2 గెలిచింది, ఒకటి డ్రా అవ్వగా మరొకటి ఓడింది. ఇక సెహ్వాగ్ కెప్టెన్సీలో వన్డేల్లో 12 మ్యాచ్‌లకు 7 గెలిచి, 5 ఓడింది.
సెహ్వాగ్ ఘనతలు
- టెస్టుల్లో తొలి ట్రిఫుల్ సెంచరీ, రెండు ట్రిఫుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
- వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు సెహ్వాగ్.
- అర్జున అవార్డు, పద్మ శ్రీ,ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ 2010, విజ్డన్ లీడ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ 2008,2009.
- తొలి టెస్టు– సౌత్ ఆఫ్రికాతో 2001, చివరిది ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌లో 2013.
- తొలి వన్డే– పాకిస్థాన్‌తో మొహాలీలో 1999. చివరిది పాకిస్థాన్‌తో కోల్ కత్తాలో 2013. తొలి టీ 20 సౌత్ ఆఫ్రికా 2006. చివరిది సౌత్ ఆఫ్రికాతో 2012.
Comments
Please login to add a commentAdd a comment