50-50 ఒక్కసారే... | Visakhapatnam cricket fans to enjoy full-overs do not enjoying | Sakshi
Sakshi News home page

50-50 ఒక్కసారే...

Published Sun, Nov 24 2013 1:03 AM | Last Updated on Tue, May 29 2018 7:04 PM

Visakhapatnam cricket fans to enjoy full-overs do not enjoying

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 వైజాగ్ అభిమానులకు పూర్తి ఓవర్ల వన్డే మ్యాచ్‌ను ఆస్వాదించే అవకాశం పెద్దగా దక్కడం లేదు. వర్షంతో విరామం... స్లో ఓవర్ రేట్... ముందే లక్ష్యం పూర్తి... ఇలా కారణమేదైనా వైజాగ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లలో ఒక్కసారి మినహా (ఆస్ట్రేలియా-కెన్యా) ఇరు జట్లు చెరో 50 ఓవర్లు పూర్తిగా ఆడలేదు. నగరంలో ఇప్పటి వరకు 9 వన్డే మ్యాచ్‌లు జరగ్గా... 8 మ్యాచ్‌లు ముందే ముగిశాయి.

 ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో గతంలో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియాతో 2010లో జరిగిన మ్యాచ్‌లో 7 బంతులు... విండీస్‌తో 2011 లో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యం ఛేదించింది. అంతకుముందు 2007లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. ధోని ధమాకా చూపించిన 2005 వన్డేలో పాకిస్థాన్ 23 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది.
 
 కొత్త స్టేడియం నిర్మించకముందు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో ఐదు వన్డే మ్యాచ్‌లు నిర్వహించారు. వీటిలో ఆసీస్, కెన్యా వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే ఇరుజట్లు పూర్తిగా 50-50 ఓవర్లు ఆడాయి.
 
 1988లో భారత్‌తో ఆడుతూ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 22 బంతుల ముందే ముగిసింది.
 
 1999లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు ఓవర్ల జరిమానా విధించడంతో పాకిస్థాన్ 48 ఓవర్లకే ఆడాల్సి వచ్చింది.
 
 వాతావరణం సరిగా లేకపోవడంతో  2001లో భారత్, ఆసీస్ మ్యాచ్‌ను 45 ఓవర్లకే కుదించి నిర్వహించారు.
 
 వీటన్నింటికీ భిన్నమైన ఘటన 1994 భారత్, వెస్టిండీస్ మ్యాచ్ సందర్బంగా జరిగింది. వెస్టిండీస్ జట్టు కిట్‌ను పొరపాటున వైజాగ్‌కు కాకుండా చెన్నైకి పంపిం చారు. అది వచ్చేసరికి ఆలస్యమైంది. దాంతో మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. ఇందులోనూ... విండీస్ స్లో ఓవర్ రేట్‌తో 43 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది.
 
 హోటల్‌లో ధోని ‘ప్రాక్టీస్’...
 వైజాగ్ చేరాక వాతావరణం చూడగానే శనివారం ప్రాక్టీస్ ఉండదని భారత కెప్టెన్ ధోనికి అర్థమైనట్లుంది. అందుకే ప్రాక్టీస్ లేకపోతేనేం... ప్లే స్టేషన్ ఉంది కదా అని ట్వీట్ చేస్తూ వీడియో గేమ్స్ ఆడేందుకు సిద్ధమైపోయాడు. శనివారం గేమ్స్‌తో టైమ్‌పాస్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్‌లో వాటి గురించి చర్చిస్తూ ధోని గడిపాడు. చాలా రోజుల తర్వాత గేమ్ ఆడుతున్నానని చెప్పిన ధోని, తాను ఇష్టపడే క్యాండీ రష్ గేమ్‌లో స్కోరు కూడా వెల్లడించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement