విశాఖ స్టేడియానికి టెస్టు హోదా
ముంబై: విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ -వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా కల్పిస్తూ బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కొత్తగా విశాఖతో పాటు రాంచీ, ఇండోర్, రాజ్ కోట్, పుణే స్టేడియాలకు టెస్టు హోదా కల్పించారు.
దీంతో పాటు టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ శుక్లాను తిరిగి అదే స్థానంలో కొనసాగించాలని వార్షిక సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకూ భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలకగా, వారి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరభ్ గంగూలీని నియమించారు.