డేవిడ్ వార్నర్
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మాట నిలబెట్టుకున్నాడని ఆ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. వార్నర్ ఈ సీజన్‌లో 500 పరుగులు చేస్తానని మాటిచ్చాడని, అన్నట్లుగానే 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేసాడని పేర్కొన్నాడు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన కథనంలో లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘హైదరాబాద్‌లో మేమంతా ఓ షూటింగ్ మధ్యలో ఉండగా.. హెడ్ కోచ్ టామ్ మూడికి డేవీ(వార్నర్) ఓ సందేశాన్ని పంపించాడు. ఈ సీజన్‌లో 500 పరుగులు చేస్తానని ప్రామిస్ చేస్తున్నట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. అతను అన్నట్లుగా తన లక్ష్యాన్ని చేరుకుంటూ ఆడిన తీరు అద్భుతం. వాస్తవానికి సీజన్ ప్రారంభంలో మేం కొంత ఆందోళనకు గురయ్యాం. గడ్డుకాలాన్ని ఎదుర్కొని వార్నర్ అప్పుడే క్రికెట్‌లోకి పునరాగమనం చేయడం.. పైగా మోచేతి గాయంతో బాధపడుతుండటంతో అతనిపై అంతగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ అతను అద్భుతంగా ఆడాడు. అతని విపరీతమైన మానసిక ఆందోళనను అధిగమించాడు. అతని భార్య క్యాండీ అతని బలం.’ లక్ష్మణ్ పేర్కొన్నాడు.
బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంతో గత సీజన్ ఐపీఎల్‌కు దూరమైన వార్నర్.. ఈ సీజన్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 8 హాఫ్ సెంచరీలు 1 సెంచరీతో 692 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా వార్నర్ స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వార్నర్ తర్వాత కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ 520 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment