ఏమైంది హైదరాబాద్‌కు! వారం క్రితం ఇక్కడే ఉప్పెనలా చెలరేగింది. ఇద్దరు ఓపెనర్లే (వార్నర్, బెయిర్ స్టో) 200 పైచిలుకు భాగస్వామ్యం చేశారు. తర్వాత అద్భుతమైన బౌలింగ్‌తో కోహ్లి సేనను చిత్తుగా ఓడించింది.కానీ ఇప్పుడు ఓ సులభసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ముంబై ఇండియన్స్‌ను చక్కగా కట్టడి చేసినా... బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఒక్కడి (జోసెఫ్ అల్జారి) బౌలింగ్‌కు కకావికలమైంది. మూడు వరుస విజయాల తర్వాత సన్ జోరుకు చుక్కెదురైంది.
సాక్షి, హైదరాబాద్: విండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్... ఐపీఎల్‌కు కొత్త. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశాడు. 12 పరుగులే ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేకులేశాడు. దీంతో సొంతగడ్డపై స్వల్పలక్ష్యాన్ని ఛేదించలేక హైదరాబాద్ పరాజయం పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 40 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పొలార్డ్ (26 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే వెన్నెముకగా నిలబడ్డాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. దీపక్ హుడా చేసిన 20 పరుగులే టాప్ స్కోర్. అల్జారి జోసెఫ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
రోహిత్ మళ్లీ విఫలం...
ముంబై ఇండియన్స్ జట్టులో ఒక్కడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ నుంచి పాండ్యా బ్రదర్స్ దాకా అందరూ రైజర్స్ బౌలింగ్‌కు తలొగ్గారు. ఓపెనర్ డికాక్ 19 పరుగులు చేశాడు. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట ముంబై ఇండియన్స్ పరుగుల ఆట ప్రారంభించింది. రోహిత్ శర్మ (11)ను నబీ ఔట్ చేయడంతో మొదలైన వికెట్ల పతనం 65 పరుగులకే సగం వికెట్లను కూల్చేసింది. సూర్యకుమార్ (7)ను సందీప్ ఎల్బీగా పంపాడు. పవర్ ప్లేలో ఈ రెండు వికెట్లను కోల్పోయి 30 పరుగులు చేసిన ముంబై 10 ఓవర్లు ముగిసేసరికి మరో వికెట్ (డికాక్)ను చేజార్చుకొని 51 పరుగులే చేసింది.
ఆఖర్లో పొలార్డ్ మెరుపులు
ముంబై ఇన్నింగ్స్‌కు పొలార్డ్ ఆపద్బాంధవుడయ్యాడు. 8 పరుగుల వద్ద రషీద్ క్యాచ్ మిస్‌చేయడంతో బతికిపోయిన పొలార్డ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (14; 1 సిక్స్) 17వ ఓవర్‌దాకా క్రీజులో ఉన్నా చేసేదేమీ లేకపోయింది. 18 ఓవర్లు ముగిశాయి. ముంబై వంద పరుగులైనా చేయలేదు. ఇక మిగిలింది 12 బంతులే! ఈ దశలో సిద్ధార్థ్ కౌల్ 19వ ఓవర్లో పొలార్డ్ 3 సిక్సర్లు బాదడంతో 20 పరుగులొచ్చాయి. భువీ ఆఖరి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో 19 పరుగులు లభించాయి.
సన్‌రైజర్స్‌దీ తడబాటే..
స్వల్ప లక్ష్యమే అయినా హైదరాబాద్ తడబడింది. మూడో ఓవర్లో వార్నర్ ఒక బౌండరీ, బెయిర్ స్టో 2 ఫోర్లు కొట్టారు. 27/0 స్కోరుతో బాగానే ఉన్న ఆ తర్వాతి ఓవర్ నుంచి కష్టాలు మొదలయ్యాయి. మూడు బంతుల వ్యవధిలో బెయిర్ స్టో (10 బంతుల్లో 16; 3 ఫోర్లు), వార్నర్ (13 బంతుల్లో 15; 2 ఫోర్లు) ఔటయ్యారు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ తొలి బంతికే అల్జరి జోసెఫ్... వార్నర్ వికెట్ తీశాడు. అప్పటికి జట్టు స్కోరు 33/2. ఇక ఇక్కడి నుంచి హైదరాబాద్ ఇన్నింగ్స్ గతితప్పింది. తొలి సగం ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 59 పరుగులు చేసింది. మనీశ్ పాండే (16), యూసుఫ్ పఠాన్ (0) ఔట్ కావడంతో పరాజయం దిశగా పయనించింది.
►6/12 ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. సొహైల్ తన్వీర్ (6/14) రికార్డును అల్జారి సవరించాడు.
►96 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 2015లో హైదరాబాద్‌లోనే ముంబై చేతిలో 113 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment