మాస్కో: అంతర్జాతీయ క్రీడల్లో మరో నాలుగేళ్ల పాటు రష్యా జెండా, అథ్లెట్లు కనిపించరేమో! తప్పుడు డోపింగ్ పరీక్షా ఫలితాలు, నిర్వహణతో రష్యా క్రీడా సమాఖ్య ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు సిఫార్సు చేసింది. మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన ‘వాడా’ స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఆ మేరకు నిషేధాన్ని సూచించింది.
రష్యా ఆటగాళ్లు పాల్గొనకుండా చేయడంతో పాటు రష్యా అంతర్జాతీయ పోటీల ఆతిథ్యానికి బిడ్ వేసే అవకాశముండదు. ఇదే జరిగితే యూరో 2020 ఈవెంట్‌ను ఈ సారి ఉమ్మడిగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదిక కూడా ఉండటం ఫుట్‌బాల్ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ) చీఫ్ యూరీ గానస్ మాట్లడుతూ ‘నిషేధం తప్పేలా లేదు. నాలుగేళ్ల పాటు ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో మా వాళ్లకు టోక్యో ఒలింపిక్స్ (2020), బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ (2022) మెగా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు’ అని అన్నారు. 2015లో రష్యాలో వ్యవస్థీకృత డోపింగ్ వ్యవహారం అంతర్జాతీయ క్రీడా సమాజంలో కలకలం రేపింది.
అక్కడి క్రీడాధికారులు, కోచ్‌లు తమ క్రీడాకారులకు శిక్షణతో పాటు నిషేధిత ఉ్రత్పేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో ‘వాడా’ విచారణకు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో అధికారుల అండదండలతోనే ఇదంతా జరిగిందని తేలడంతో కథ ఆ దేశ నిషేధానికి చేరింది. సాధారణంగా డోపీలపై నిషేధం విధించడం సర్వసాధారణం కానీ... ఇక్కడ అధికారగణం ప్రోద్బలంతోనే ఇదంతా జరగడంతో ఏకంగా రష్యానే నిషేధించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత రియో ఒలింపిక్స్ (2016)లో రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను అనుమతించలేదు. మిగతా క్రీడాకారులను మాత్రం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గొడుగు కింద అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment