'సూపర్' విజయం కావాలి
చెన్నైని ఊరిస్తున్న మూడో టైటిల్ పటిష్టంగా ధోని సేన
ఐపీఎల్‌లో అందరికంటే నిలకడగా రాణించిన జట్టు నిస్సందేహంగా చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీలో 60కి పైగా విజయశాతం ఉన్న ఏకైక టీమ్ ఇది. ఏడు టోర్నీలలో రెండు సార్లు విజేత, మూడు సార్లు రన్నరప్, మరో రెండు సార్లు కనీసం సెమీస్ దశ చేరిన ఘనత ధోని సేనదే. భారత జట్టులోని కీలక సభ్యుల అండతో సూపర్ కింగ్స్ పటిష్టంగా ఉంది. అయితే గత మూడు సీజన్లుగా ఆ జట్టు టైటిల్‌కు చేరువైనట్లే అనిపించి దూరమవుతోంది.
వరుసగా రెండేళ్లు ఫైనల్లో ఓడిన టీమ్, మరోసారి సెమీస్‌లో వెనుదిరిగింది. బెట్టింగ్ వివాదాలతో ఒక దశలో ఈ సీజన్‌లో ఆడుతుందా లేదా అనే అనుమానాల మధ్య ఊగిసలాడిన చెన్నై ఎట్టకేలకు ఎలాంటి ప్రమాదం లేకుండా బరిలో నిలిచింది. మరి ఐపీఎల్-8లోనైనా జట్టు అదృష్టం మారుతుందా!
సాక్షి క్రీడా విభాగం : చెన్నై విజయమంత్రం అంతా ఆ జట్టు కూర్పులోనే ఉంది. తొలి ఐపీఎల్‌నుంచి చూస్తే టీమ్‌లో ఒక్కసారిగా భారీ మార్పులు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ప్రతీ ఏటా ఒకటి రెండు మార్పులు, దేశవాళీ కుర్రాళ్లకు అనుభవం కోసం చోటు కల్పించడం తప్పిస్తే టీమ్ తుది జట్టును సులభంగా అంచనా వేయవచ్చు. దాంతో అభిమానులపరంగా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా సూపర్ కింగ్స్‌కు ప్రత్యేక ముద్ర, నమ్మకమైన ఫాలోయింగ్ ఉంది.
భారత కెప్టెన్ ధోని ఆ జట్టుకు పెద్ద బ్రాండ్ ఇమేజ్. టీమ్‌లో రెగ్యులర్ ఆటగాళ్లుగా రైనా, అశ్విన్‌లకు తిరుగులేదు. 2008లో ఆ జట్టు ఫైనల్లో రాజస్థాన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అనంతరం దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో సెమీస్‌కు పరిమితమైంది. కానీ ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో సూపర్ కింగ్స్ హవా కొనసాగింది. 2010లో 16 మ్యాచ్‌లలో 9 విజయాలతో ట్రోఫీ గెలుచుకున్న ఆ జట్టు 2011లో మరింత మెరుగ్గా ఆడి 11 విజయాలతో టైటిల్ నిలబెట్టుకుంది. అయితే మరో రెండేళ్లు మాత్రం ధోని సేనకు తుది మెట్టుపై భంగపాటు ఎదురైంది. 2012 ఫైనల్లో కోల్‌కతా చేతిలో ఓడిన ఈ జట్టు, మరుసటి ఏడాది తుది పోరులో ముంబైకి తలవంచింది.
ప్లేఆఫ్‌తో ముగింపు...
2014లో వేలంకు ముందే ధోని, రైనా, జడేజా, అశ్విన్, బ్రేవోలను అట్టి పెట్టుకున్న చెన్నై...వేలంలో బ్రెండన్ మెకల్లమ్, డు ప్లెసిస్, డ్వేన్ స్మిత్‌లను తీసుకుంది. టోర్నీ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలు సాధించి జట్టు అద్భుతమైన ఫామ్‌లో కనిపించింది. అయితే ఆ తర్వాత కాస్త తడబడి వరుస పరాజయాలు ఎదుర్కొంది. చివరకు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో ముంబైని ఓడించిన ఆ జట్టు, రెండో క్వాలిఫయర్‌లో మాత్రం పంజాబ్ చేతిలో పరాజయం పాలైంది.
మార్పులు చేర్పులు
గతంలో తమ జట్టుకే ఆడిన మైక్ హస్సీని ఈ సారి చెన్నై మళ్లీ సొంతం చేసుకుంది. హస్సీ లేదా స్మిత్‌లలో ఒకరు ఓపెనర్‌గా ఆడవచ్చు. గతేడాది మెకల్లమ్ 405 పరుగులు చేసినా అతని స్థాయిని బట్టి చూస్తే తగిన స్ట్రైక్ రేట్ (121.62)తో ఆడలేదు. అయితే ప్రపంచకప్‌లో మెకల్లమ్ ఫామ్‌ను బట్టి చూస్తే ఈ సారి చెన్నై మెకల్లమ్‌నుంచి భారీగానే ఆశిస్తోంది. గత ఏడాది జట్టు ప్రధాన పేసర్లు ఓవర్‌కు 8కి పైగా పరుగులిచ్చి నిరాశపరిచారు. ఈ సారి కొత్తగా చెన్నై రూ. 30 లక్షలతో దక్షిణాఫ్రికా పేసర్ కైల్ అబాట్‌ను తీసుకుంది. ప్రపంచకప్‌లోనూ రాణించిన అతనికి ఈ ఫార్మాట్‌లో తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తాడనే రికార్డు ఉంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ సారి చెన్నైతో చేరాడు.
కీలక ఆటగాళ్లు: ఐపీఎల్‌లో చెన్నై ఆడిన 115 మ్యాచ్‌లలోనూ ఆడిన ఆటగాడు రైనా. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల (3325) రికార్డు అతనిదే. మూడో స్థానంలో రైనా మెరుపులు ప్రతీసారి చెన్నై ఫలితాన్ని శాసిస్తున్నాయి. ఇక వరల్డ్ కప్‌లో లేని డ్వేన్ బ్రేవో పూర్తి ఫిట్‌గా బరిలోకి దిగుతున్నాడు. గత ఏడాది బౌలర్‌గా అద్భుతంగా రాణించిన జడేజా ఈ సారి బ్యాట్స్‌మన్‌గా కూడా సత్తా చాటాల్సి ఉంది. ధోని, డుప్లెసిస్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉండగా, ఐపీఎల్‌లో అశ్విన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు ఎప్పుడైనా కష్టమే.