
'మా క్రికెటర్లు ఫిక్సింగ్ కు పాల్పడలేదు'
దుబాయ్:నాలుగు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో మ్యాచ్ ఫిక్సింగ్ చోటు చేసుకుందన్న ఆరోపణల్ని పాకిస్థాన్ చీఫ్ కోచ్ వకార్ యూనస్ ఖండించాడు. తమ క్రికెటర్లు ఎటువంటి ఫిక్సింగ్ కు పాల్పడ లేదంటూ వకార్ పేర్కొన్నాడు. ఆటలో గెలుపు -ఓటములు అనేవి సహజంగానే జరుగుతూ ఉంటాయని.. ఒక వన్డేలో పరాజయం చెందినంత మాత్రాన ఫిక్సింగ్ జరిగినట్లు కాదన్నాడు. తమ ఆటగాళ్ల ఆట తీరుపై చాలా సంతృప్తిగా ఉన్నామని వకార్ తాజాగా తెలిపాడు. బ్రిటీష్ పత్రిక డైలీ మెయిల్ మూడో వన్డేలో ఫిక్సింగ్ జరిగినట్లు ఓ కథనాన్ని ప్రచురించింది. ముగ్గురు పాక్ ఆటగాళ్లు చాలా సింపుల్ గా రనౌట్లు కావడమే అందుకు ఉదాహరణకు పేర్కొంది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు కూడా చేసినట్లు పేర్కొంది.
అంతకుముందు ఆ మ్యాచ్ కు సంబంధించి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా కొన్ని ట్వీట్లను కూడా సంధించాడు. షార్జాలో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడంలో చోటు చేసుకున్న పరిణామాల్ని వాన్ తన ట్వీట్లలో ప్రస్తావించాడు. పాక్ చెందిన ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు అయిన తీరును ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ విధంగా రనౌట్లు కావడం పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేదంటూ ఫిక్సింగ్ వివాదాన్ని రేపాడు. కాగా, వాన్ తమపై అనుమానం వ్యక్తం చేయడాన్ని షహర్యార్ ఖాన్ తప్పుబట్టారు. అది కచ్చితంగా తప్పుడు స్టేట్ మెంట్ అని, వాన్ వ్యవహారాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. దీంతో ఉలిక్కిపడిన వాన్ ఆ ట్వీట్లను తొలగించాడు.