
నా క్రికెట్ కోచింగ్ కాంట్రాక్ట్ కంటే..
లాహోర్: తన కోచింగ్ కాంట్రాక్ కంటే త్వరలో జరుగనున్న ఆసియాకప్, వరల్డ్ టీ 20 టోర్నీలే ప్రస్తుత లక్ష్యాలని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనస్ స్పష్టం చేశాడు. వచ్చే మే నెలతో వకార్ కోచింగ్ కాంట్రాక్ట్ ముగిసిపోతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు అతను స్పందించాడు. ప్రస్తుతం తన కోచింగ్ పదవి కాంట్రాక్ట్ పొడిగింపుపై ఎటువంటి దృష్టి నిలపలేదన్నాడు. మరికొద్ది రోజుల్లో ఆసియాకప్, వరల్డ్ టీ 20 జరుగనుండటంతో అది తనకు అసలు సిసలైన సవాల్ అని పేర్కొన్నాడు. ఇంకా మూడు, నాలుగు నెలలు కాంట్రాక్ట్ ఉండటంతో ఇప్పుడే భవిష్య కార్యాచరణ గురించి ఆలోచించడం లేదన్నాడు.
ఏ జట్టు కోచ్కైనా ఆ పదవి అనేది చాలా క్లిష్టమైనదన్నాడు. కొన్నిసార్లు మంచి ఫలితాలు ఉత్సాహపరిస్తే, మరికొన్ని సందర్భాల్లో జట్టు ఓటమి నిరాశపరుస్తుందన్నాడు. ఈ తరహా ఛాలెంజ్లకు ఎప్పుడైతే సిద్ధమయ్యానో.. అప్పట్నుంచే వాటిని ఎంజాయ్ చేయడం ప్రారంభించానని తెలిపాడు. కోచింగ్ కాంట్రాక్ట్ పై దృష్టి నిలిపై సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. రాబోవు ఈ రెండు ప్రధాన టోర్నీల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని వకార్ పేర్కొన్నాడు.