
కోచ్ పదవికి వకార్ గుడ్ బై
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వకార్ యూనస్ ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా విషయాన్ని సోమవారం మీడియా ముందు వెల్లడించాడు. ' పాకిస్తాన్ కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నా. నేను చాలా నిబద్దతతో గత 19 నెలలుగా పాకిస్తాన్ కోచ్గా పని చేశా. వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కారణంగా చూపుతూ నన్ను బలిపశువును చేసేందుకు బోర్డు యత్నిస్తోంది. నేను పాకిస్తాన్ క్రికెట్ కు చేసిన సేవను తక్కువగా చూపే ప్రయత్నం చేయొద్దు. మాజీ క్రికెటర్లకు ఇదే నా విన్నపం' అంటూ ఒకింత బాధగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
2015 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఘోర ప్రదర్శనపై అప్పట్లోనే పీసీబీకి కొన్ని ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేసినా దానిని అమలు చేయడంలో బోర్డు విఫలమైందని వకార్ ఈ సందర్భంగా విమర్శించాడు. ఆ నివేదికపై పీసీబీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం కూడా తాను తీవ్రంగా నిరాశచెందడానికి ప్రధాన కారణమన్నాడు.