వార్న్ వారియర్స్ క్లీన్‌స్వీప్ | Warne Warriors sweep | Sakshi
Sakshi News home page

వార్న్ వారియర్స్ క్లీన్‌స్వీప్

Published Sun, Nov 15 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

వార్న్ వారియర్స్ క్లీన్‌స్వీప్

వార్న్ వారియర్స్ క్లీన్‌స్వీప్

మళ్లీ ఓడిన సచిన్ సేన ముగిసిన ఆల్ స్టార్స్ సిరీస్
 
లాస్ ఏంజెల్స్: క్రికెట్ ప్రపంచం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించి, ప్రత్యక్షంగా అమెరికా అభిమానులకు ఆనందం పంచిన ఆల్ స్టార్స్ సిరీస్ ఆదివారం ముగిసింది. దిగ్గజ క్రికెటర్లంతా ఒక చోట చేరి టి20 వినోదం పంచిన ఈ టోర్నీలో మొత్తంగా సచిన్ బ్లాస్టర్స్‌పై వార్న్ వారియర్స్‌దే పైచేయి అయింది. ఇక్కడి డాడ్జర్ స్టేడియంలో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో వారియర్స్ 4 వికెట్ల తేడాతో బ్లాస్టర్స్‌ను ఓడించింది. ఫలితంగా 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సచిన్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ముందుండి నడిపించగా, మాజీ సహచరుడు సౌరవ్ గంగూలీ (37 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. జయవర్ధనే (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కార్ల్ హూపర్ (22 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా రాణించారు. వెటోరికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం వారియర్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కలిస్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), పాంటింగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సంగక్కర (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లతో పాటు సైమండ్స్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కలిస్, పాంటింగ్ కలిసి ఆరో వికెట్‌కు 37 బంతుల్లోనే 88 పరుగులు జోడించడం జట్టుకు విజయాన్నందించింది. సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారం లభించింది.

సచిన్, సౌరవ్ దూకుడు...
టాస్ గెలిచిన బ్లాస్టర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన సెహ్వాగ్ (15 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సచిన్‌తో కలిసి తొలి వికెట్‌కు 23 బంతుల్లోనే 55 పరుగులతో శుభారంభం అందించారు. అనంతరం సచిన్, జయవర్ధనే ఇదే జోరును కొనసాగిస్తూ రెండో వికెట్‌కు 34 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. వీరిద్దరు మూడు పరుగుల వ్యవధిలోనే వెనుదిరిగారు. ఆ తర్వాత గంగూలీ, హూపర్ చెలరేగి 51 బంతుల్లోనే 86 పరుగులు చేయడంతో బ్లాస్టర్స్ భారీ స్కోరు సాధించింది.
 
కీలక భాగస్వామ్యాలు.
..
 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంబ్రోస్ వేసిన తొలి బంతికే వాన్ (0) బౌల్డ్ కావడంతో వారియర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌కు 25 బంతుల్లో 50 పరుగులు జోడించిన తర్వాత సైమండ్స్ అవుట్ కాగా, లక్ష్మణ్ చక్కటి ఫీల్డింగ్‌కు హేడెన్ (12) రనౌటయ్యాడు. ఈ దశలో సంగక్కర, రోడ్స్ (17) మధ్య 58 పరుగుల భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. సెహ్వాగ్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి మూడు పరుగుల దూరంలో కలిస్ అవుటైనా...ఐదో బంతిని వార్న్ సిక్సర్ బాది తన జట్టుకు క్లీన్ స్వీప్ విజయాన్ని అందించాడు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement